ఆల్తుర్తి గ్రామంలో మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: ‘నేను స్థానికుడిని. మండలంలో ప్రతి గ్రామం గురించి తెలుసు. మీకేం కావాలో ఐడియా ఉంది. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అలియాస్ అల్లీపురంరెడ్డి అవకాశం కోసం వస్తున్నాడు. ఆయన్ను నమ్మొద్దు. ఎన్నికలయ్యాక కనిపించడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆల్తుర్తి, ఆర్‌వైపాళెం, అంకుపల్లి, వెంకటాపురం, పర్వతాపురం, పులికల్లు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ వారిని మోసం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి వీధిలో సిమెంటురోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించామన్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి వస్తున్నాడని, ఆయన్ను నమ్మొద్దని సూచించారు.
ఓటెందుకు వేయాలి సోమిరెడ్డి..
ఏం మేలు చేశావని ప్రజలు నీకు ఓటేయాలని సోమిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నారు. రూ.కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేశానని, మురుగునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు కాకాణి చెప్పారు. పేదలకు భూముల పంపిణీ, చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. మూడో పర్యాయం అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయో గుర్తించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట చిల్లకూరు వెంకురెడ్డి, పి.బాబిరెడ్డి, బూసుపల్లి చిన్నపరెడ్డి, కె.రామిరెడ్డి, శ్రీహరి, చంద్రశేఖర్, వై.పెంచలరెడ్డి, టి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment