ఆత్మకూరును అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆత్మకూరును అభివృద్ధి చేస్తాం

Published Thu, Apr 18 2024 11:40 AM | Last Updated on Thu, Apr 18 2024 11:40 AM

మాట్లాడుతున్న రాజమోహన్‌రెడ్డి  
 - Sakshi

మాట్లాడుతున్న రాజమోహన్‌రెడ్డి

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

మర్రిపాడు: ‘ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలి’ అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. మండలంలోని చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పలువురికి ప్యాకేజీలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేశారన్నారు. దీని వల్ల వైఎస్సార్‌సీపీకి మేలు చేకూరిందన్నారు. అనేకమంది విక్రమ్‌రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏఎస్‌పేటలో జరిగిన కార్యక్రమంలో ఆనం చేసిన వ్యాఖ్యలపై సవాల్‌ చేస్తున్నామన్నారు. వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాతే ఆత్మకూరులో రామనారాయణరెడ్డి తిరుగుతున్నారని చెప్పారు. వెంకటగిరికి వెళ్లిపోయాడని, వేమిరెడ్డి అందజేసిన ప్యాకేజీతో ఆనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఆయనకు త్వరలోనే సరైన సమాధానం చెబుతామన్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మరని, వైఎస్సార్‌సీపీని ప్రజలంతా మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులునాయుడు, దశరథరామిరెడ్డి, గువ్వల వెంగళరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మౌలాలి, హజరత్‌రెడ్డి, దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్‌రెడ్డి, రేవూ రు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా తనిఖీలు

నెల్లూకరు(క్రైమ్‌): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణా కట్టడికి పోలీసు, సెబ్‌ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళ, బుధవారాల్లో మనుబోలు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంకటాచలసత్రం పరిధిలో 19, ఇందుకూరుపేటలో 10, సైదాపురంలో ఆరు మద్యం బాటిళ్లు, సెబ్‌ అధికారులు 195 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

కండలేరులో

7.636 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 7.636 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి సత్యసాయిగంగకు 250 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్‌ కాలువకు 25 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement