చిన్నారిని అపహరించి.. అమ్మేసి..
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్
కావలి: పట్టణంలోని వెంగళరావునగర్ ప్రాంతంలో ఊయల్లో ఉన్న చిన్నారిని అపహరించిన కేసులో మహిళను, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ వెల్లడించారు. కావలిలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెంగళరావునగర్‌కు చెందిన సూర్యనారాయణ, రాజేశ్వరి దంపతులకు 14 నెలల వయసున్న తేజ అనే కుమారుడు ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం రాజేశ్వరి తేజను ఊయల్లో వేసి నిద్రపుచ్చి స్నానానికి వెళ్లింది. కాసేపటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తేజ కనిపించలేదు. దీంతో వెంటనే కావలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు రూరల్, కావలి డీఎస్పీల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. చిన్నారిని అపహరించిన నిందితులను మంగళవారం రాత్రి కందుకూరు శివార్లలో పోలీసు బృందాలు పట్టుకున్నాయి. తేజను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను విచారించారు. శెట్టిపల్లి స్వరూపకు వింజమూరులో నివాసం ఉండే ఏఎస్‌పేట మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ఉపేంద్రతో పరిచయముంది. అతడిఅన్నకు సంతానం లేదు. దీంతో పెంచుకోవడానికి పిల్లలు కావాలని స్వరూపను అడిగాడు. ఆమె డబ్బు కోసం తేజను కిడ్నాప్ చేసి ఉపేంద్రకు రూ.1,10,000కు అమ్మేసింది. నిందితులను అరెస్ట్ చేసి కారు, రూ.1,10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment