యజమానిపై కక్ష పెంచుకుని..
● కారు, బస్సును తగులబెట్టిన మాజీ డ్రైవర్
నెల్లూరు(క్రైమ్): యజమానికి చెందిన కారు, బస్సును ఓ వ్యక్తి తగులబెట్టిన ఘటన బుధవారం రాత్రి నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న వై.శ్రీనివాసులురెడ్డి కామాక్షి ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద వెంకటేశ్వరపురానికి చెందిన గౌస్‌బాషా డ్రైవర్‌గా చేరాడు. ఈ ఏడాది మొదట్లో గౌస్ నడుపుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీనికి అతని నిర్లక్ష్యమే కారణమని భావించిన శ్రీనివాసులురెడ్డి పని నుంచి తొలగించాడు. తనను పనిలో పెట్టుకోవాలని పలుమార్లు గౌస్ అడిగినా యజమాని ఒప్పుకోలేదు. దీంతో గౌస్ జూన్‌లో శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయగా వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కోర్టులో తప్పు ఒప్పుకొని జరిమానా కట్టి కేసు నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి యజమానిపై కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం శ్రీనివాసులురెడ్డి పనిమీద బెంగళూరు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న గౌస్ బుధవారం అతని ఇంటికెళ్లాడు. అక్కడ నక్కి చూస్తుండగా శ్రీనివాసులురెడ్డి భార్య బయటకు వచ్చి ప్రశ్నించగా పనిలో చేరేందుకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులు ఫంక్షన్‌కు వెళ్లారు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న గౌస్‌బాషా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుకు నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. అనంతరం సింహపురి హోటల్ సమీపంలో శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన బస్సుకు గౌస్ నిప్పంటించి పరారయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. వేదాయపాళెం, సంతపేట పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment