కరెంట్.. సర్దుపోటు
సామాన్య, మధ్య తరగతి
ప్రజలపై భారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసింది. నిత్యావసరాల నుంచి కూరగాయలు, వంట నూనెలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లుగా అదనంగా విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెంచడం దారుణం. జిల్లా ప్రజలపై 15 నెలలకు రూ.120 కోట్లు విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి.
– దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్
కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి మోసమా
గత ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. ఇంకా చార్జీలు తగ్గిస్తామని చెప్పి.. అధికారం చేజిక్కగానే పేద, మధ్య తరగతి నడ్డి విరిచేలా నెలకు రూ.8 కోట్లు భారం మోపడం సరికాదు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచకూడదు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే ఆందోళనలు చేస్తాం.
– కత్తి పద్మ, ఐద్వా నగర కార్యదర్శి
● యూనిట్‌పై రూ.1.50 చొప్పున
చార్జీల మోత
● జిల్లా ప్రజలపై ట్రూఅప్ భారం
నెలకు రూ.8 కోట్లు
● నవంబర్ నుంచి పదిహేను
నెలల పాటు వసూలు
● రెండో విడత సర్దుబాటు
చార్జీలకూ ‘ఏపీఈఆర్‌సీ’ సిద్ధం
● ఈ భారం దాదాపు రూ.240 కోట్ల వరకు ఉండే అవకాశం
● 11 లక్షల మంది
వినియోగదారులకు షాక్
జిల్లా ప్రజలకు ఈ నెల నుంచే కరెంట్ బిల్లుల షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ట్రూఅప్ సర్దుబాటు పేరుతో చార్జీల మోత మోగిస్తోంది. తమ కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీల భారాన్ని తగ్గిస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు.. ఐదు నెలలు తిరగక ముందే తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారు. ఈ నవంబర్ నుంచి 2026 జనవరి వరకు పదిహేను నెలల పాటు విద్యుత్ చార్జీల భారాన్ని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు భరించక తప్పని పరిస్థితి అనివార్యమవుతోంది.
నెల్లూరు (వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులకు కరెంట్ సర్దు‘పోటు’ భారంగా మారింది. నవంబర్ బిల్లుల నుంచే యూనిట్ వినియోగంపై రూ.1.50 వంతున చార్జీలు పెరిగాయి. గత నెల వరకు 100 యూనిట్ల విద్యుత్ వినియోగానికి అన్ని చార్జీలు కలుపుకుని రూ.270 వస్తే.. ఈ నెలలో అవే యూనిట్లకు రూ.438 బిల్లు వచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో చేసిన అక్రమాలు, తప్పిదాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. అయితే ఆ బిల్లులే అధికమంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు, కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ వినియోగదారులకు మంచి చేస్తామని, విద్యుత్ చార్జీలు పెంచమని అవసరం అయితే 30 శాతం మేర చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలకు మించి సాయం చేస్తామంటూ ఉచిత హామీలు గుప్పించింది. కూటమి నేతల హామీలు నమ్మి గెలిపించిన ప్రజలకు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే చుక్కలు చూపిస్తూ విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ పేరుతో వినియోగదారులపై చార్జీల మోత మోగించేందుకు సిద్ధపడింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రతి నెల విద్యుత్ బిల్లుల్లో రూ.150 నుంచి రూ.450 అదనంగా పెరగనుంది.
పదిహేను నెలలకు రూ.120 కోట్ల భారం
జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి 12,81,761 విద్యుత్ సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 2,00,448 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ట్రూఅప్ చార్జీలు మినహాయింపు ఉంది. ఇక మిగిలిన 10,81,313 సర్వీసులకు ట్రూఅప్ చార్జీల భారం పడనుంది. నెలకు 100 యూనిట్లు వాడే వినియోగదారుడికి ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లుతో పాటు అదనంగా మరో రూ.150, 200 యూనిట్లు వినియోగించే వినియోగదారుడికి రూ.300, 300 యూనిట్లు వాడే వినియోగదారుడికి మరో రూ.450 అదనపు భారం పడనుంది. ఈ లెక్కన జిల్లాలో వినియోగించే యూనిట్ల విద్యుత్‌పై నెలకు సగటున రూ.8 కోట్ల భారం పడుతోంది. సర్దుబాటు చార్జీలను 15 నెలల పాటు పెంచేలా విద్యుత్ సంస్థలకు అనుమతి ఇవ్వడంతో 15 నెలలకు రూ.120 కోట్లు అదనపు భారం పడనుంది.
రెండో విడతలో రెండింతల భారం
తాజాగా విధించిన ట్రూఅప్ చార్జీల భారం నవంబర్ నుంచే ప్రారంభమైంది. రెండో విడతలో రెండింతలు అధికంగా ట్రాఅప్ చార్జీలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీఈఆర్‌సీ అభ్యంతరాలపై ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.6072.86 కోట్లు వసూలు చేస్తుండగా, అందులో జిల్లా వినియోగదారులపై రూ.120 కోట్లు పడుతోంది. రెండో విడతలో రూ.11,826.15 కోట్లు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ లెక్కన జిల్లా ప్రజలపై దాదాపు రూ.240 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తొలి విడత సర్దుబాటు వసూలు 2026 జనవరి వరకు చేయనున్న నేపథ్యంలో రెండో విడత సర్దుబాటు చార్జీలు ఈ షెడ్యూల్ తర్వాత వసూలు చేస్తారా? మధ్యలోనే కలుపుతారా అనేది త్వరలోనే స్పష్టత రానుంది.
జిల్లాలో సర్వీసులు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment