వృద్ధులను ఆదరించడం అందరి బాధ్యత
● సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి
నెల్లూరు (అర్బన్): మలిదశలో ఉన్న వృద్ధులను ఆదరించడం మన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి అన్నారు. మంగళవారం మాగుంట లేఅవుట్‌లోని వీర వృద్ధుల ఆశ్రమాన్ని జడ్జి వాణి పరిశీలించారు. వృద్ధులను పరామర్శించారు. అనంతరం అక్కడ నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేశాక అనేక మంది తమ తల్లిదండ్రులను నిరాదరించడమే కాకుండా బయటకు గెంటేయడం బాధాకరమన్నారు. ఇలా చేయడం క్షమించరాని నేరమన్నారు. వృద్ధుల రక్షణకు 2007లో సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ భారం, బాగోగులు వారి బిడ్డలు, మనుమళ్లు, మనువరాళ్లు, వారి నుంచి ఆస్తులు పొందే ప్రతి ఒక్కరిదన్నారు. అలా ఆదరించకపోతే చట్టరీత్యా ఇబ్బందులు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి
అండర్–19 కబడ్డీ పోటీలు
కావలి: పట్టణంలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్–19 బాలుర కబడీ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం వరకు పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
10న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా రెసిడెన్సియల్ విధానంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు సంబంధించి ఈ నెల 10న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్సీ సంక్షేమ, సాధికారత జిల్లా అధికారి బి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెస్ట్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఆరు కళాశాలల్లో జరుగుతుందన్నారు. నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, జెనెక్స్ విజన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ కళాశాల, గంగవరంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, కావలి పట్టణలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల, కావలిలోని మద్దూరుపాడు డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాల, కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలల్లో టెస్ట్ జరుగుతుందన్నారు. హాల్ టికెట్లు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సాంకేతిక సమస్యలుంటే 95816 30003 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment