నెల్లూరు(క్రైమ్): ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు వెంగళరావ్‌నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంగళరావ్‌నగర్ బీ బ్లాక్‌కు చెందిన అమీర్ (35), షబానా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అమీర్ కార్పెంటర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే పనులు నామమాత్రంగా ఉండటంతో సంపాదన కుటుంబ అవసరాలకు సరిపోయేదికాదు. దీంతో ఆ పని మానేసి బాడుగకు ఆటోను తీసుకుని నడుపుతుండేవాడు. అయితే సంపాదన అంతంతమాత్రంగానే ఉండగా రెండు నెలల క్రితం ఫైనాన్స్‌లో కొత్త ఆటోను తీసుకుని తిప్పసాగాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోతున్నానని చచ్చిపోతానని భార్యతో అనగా ఆమె సర్దిచెబుతూ వచ్చింది. ఆదివారం సాయంత్రం రామకోటయ్యనగర్‌లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో అమీర్ భార్య, పిల్లలను ఆటోలో అక్కడ వదిలిపెట్టాడు. రాత్రి 9.30కు వస్తానని భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10 గంటలైనా అమీర్ రాకపోవడంతో భార్య, పిల్లలు ఇంటికెళ్లి చూశారు. అమీర్ ఉరేసుకుని ఉండగా పెద్దగా కేకలు వేశారు. స్థానికుల సహాయంతో కిందకు దించి జీజీహెచ్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. షబానా సోమవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment