మాది అధికార పార్టీ.. ఏమైనా చేస్తాం
● నరసింహకొండకు సమీపంలో
గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ కనుసన్నల్లో..
● పదిరోజులుగా టిప్పర్లలో తరలింపు
నెల్లూరు సిటీ: అధికారం మాది.. అక్రమాలు చేస్తాం. అధికారులు మమ్మల్ని ఏం చేయలేరనే రీతిలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలామంది నేతలు ప్రకృతి వనరులను కొల్లగొడుతూనే ఉన్నారు. ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నా ఏ మాత్రం చలనం లేదు. రూరల్ మండలంలోని నరసింహకొండకు సమీపంలో ఉన్న కొండ్లపుడి గ్రామ పరిధిలో కొండ పొలాలు, డీకేటీ పట్టా భూముల్లో పదిరోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు. ఆయా భూముల్లో ఐదడుగుల మేర జేసీబీలతో తవ్వకాలు జరిపారు. రోజూ 70 టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ను అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ తంతు యథేచ్ఛగా జరుగుతోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు, పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.
అంతా అతనే..
గ్రావెల్ తవ్వకాలు టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఆయనే తన అనుచరులతో జేసీబీలను ఏర్పాటు చేయించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. టిప్పర్లు గ్రావెల్ లోడుతో రాత్రి వేళల్లో వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో వాహనదారులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment