వినతులిచ్చాం.. ఆదుకోండయ్యా..
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● అధికారులకు 339 అర్జీల అందజేత
నెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా చాలా దూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి ఆదుకోండి’ అని ప్రజలు అధికారులను కోరారు. కలెక్టర్ ఆనంద్ నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జనం వెల్లువలా తరలివచ్చారు. మొత్తం 339 అర్జీలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు 127 అర్జీలు, పీఆర్‌కు 30, పోలీస్ శాఖకు 27, సెర్ప్‌కు 19, పౌరసరఫరాల శాఖకు 13 అర్జీలు వచ్చాయి. ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్, జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
వినతుల్లో కొన్ని..
● సైదాపురం మండలం ఊటుకూరులో జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలంటూ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 16 సంవత్సరాలుగా గ్రామ శివారులో ఉన్న షాపును ఈసారి జనావాసాల మధ్య ఏర్పాటు చేశారన్నారు.
● మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
● అనంతసాగరం మండలానికి చెందిన ఇంటర్మీ డియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన హాసన్‌ను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ సీమాంధ్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య కోరారు. బాధితురాలితో వినతిపత్రం ఇప్పించారు.
● కోవూరు నియోజకవర్గంలోని చంద్రశేఖరపురం వద్ద నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు సుధీర్, సంజయ్‌కుమార్ కోరారు. పీఈటీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ కొరత ఉందని, 450 మంది విద్యార్థులకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారి వెంట కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీరాములు, మైనారిటీ నాయకులు ఇర్ఫాన్, సాగర్, కిశోర్ తదితరులున్నారు.
రుణమాఫీ చేయించండి సారూ..
మేం అంధులం. మా కుమారుడు కూడా అంధుడే. అతని అనారోగ్య పరిస్థితుల కారణంగా బ్యాంక్‌లో రూ.9 లక్షల మేర రుణం తీసుకున్నాం. దీనిని మాఫీ చేయించి ఆదుకోవాలి.
– డానియేలు దంపతులు, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment