రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం
● వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కక్షసాధింపు
ఆత్మకూరు / చేజర్ల: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వివరాలు.. చేజర్ల మండలంలోని తూర్పుకంభంపాడులో వలంటీర్‌గా పనిచేసిన కృష్ణవేణి తన ఉద్యోగానికి రాజీనామా చేసి గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమైపె టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. ఆమె ఎప్పుడో నిర్మించుకున్న ఇల్లు.. దుకాణాన్ని రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేశారంటూ రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మీ ఇంటి కొలతలు చూసేందుకు ఆర్‌ఐ, సర్వేయర్లు వస్తున్నారని ఆమెకు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. రెవెన్యూ అధికారులు రాగా, వారిని నిలదీశారు. అదే వీధిలో టీడీపీకి చెందిన పలువురి దుకాణాలు, ఇంటి మెట్లు రోడ్డుపై ఉంటే అవి కనిపించడంలేదానని ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. కాగా తనతో పంచాయతీ కార్యదర్శి వ్యంగ్యంగా మాట్లాడారని కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ స్థలాన్ని స్థానిక టీడీపీ నేతలుగా చెలామణి అవుతున్న వారి ద్వారా ఎంతో కాలం క్రితమే కొనుగోలు చేశానని తెలిపారు.
రెండు నెలల క్రితమూ ఇంతే..
రోడ్డును ఆక్రమించి ఇంటి మెట్లను నిర్మించారంటూ రెండు నెలల క్రితం కొందరు ఫిర్యాదు చేయగా, అప్పట్లో రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇదే విషయమై కలెక్టర్‌కు అప్పట్లోనే బాధితురాలు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఇన్‌చార్జి తహసీల్దార్ మస్తానయ్యను సంప్రదించగా, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వ్యాపార గదిని నిర్మించారని ఫిర్యాదు అందడంతో పరిశీలించేందుకు రెవెన్యూ సిబ్బంది వెళ్లారన్నారు. ఈ విషయమై మంత్రి అనుచరులు ఫోన్ చేశారని ఆయన తెలపడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment