ప్రకృతి సంపదను కొల్లగొడితే ఊరుకోబోం
సైదాపురం: మండలంలోని తెల్లరాయి చుట్టే జిల్లా రాజకీయం సాగుతోందని, ప్రకృతి సంపదను దోచుకోవాలని చూస్తే ఊరుకునేదిలేదని రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు సైదాపురంలో విలేకరులతో శనివారం ఆమె మాట్లాడారు. గనుల్లో వచ్చే అక్రమ లాభం కోసమే ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కొందరు వీడారని విమర్శించారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మరికొందరు పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లారని ఆరోపించారు. వీరు పార్టీ మారడానికి అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ కారణం కాదని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు లీజ్ కాలం ముగిసిన నాలుగు మైన్లను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఆ మైన్లను అక్రమించుకొని ఖనిజ సంపదను దోచుకోవడం నిజం కాదానని ప్రశ్నించారు. పద్మావతి మైన్‌లో అక్రమాలకు పాల్పడుతుండగా, సైదాపురం మండల ప్రజలు అక్టోబర్ 24న అడ్డుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి ఓ వాహనం సైదాపురం పోలీస్‌స్టేషన్లోనే ఉందన్నారు. ఽమండలంలోని క్వార్ట్‌జ్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు షరతులతో ఒప్పందాలు కుదుర్చుకుంది నిజం కాదానని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై అధికార పార్టీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి సంపదను దోచుకోవాలని చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment