పొట్టకూటికి ఆర్మూర్ వెళ్లి అనంతలోకాలకు
● గుండెపోటుతో వ్యక్తి మృతి
● విరువూరులో విషాదం
వరికుంటపాడు: పొట్టకూటికి కుటుంబసభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెళ్లిన విరువూరు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు.. మండలంలోని విరువూరు గ్రామానికి చెందిన బత్తల తిరుపతయ్య (47) ఎన్నో ఏళ్ల క్రితం ఆర్మూర్ వెళ్లి భవన నిర్మాణ మేసీ్త్రగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని విరువూరు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.
జేసీబీ చోరీ కేసులో
ముగ్గురి అరెస్ట్
కావలి: జేసీబీ చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో వివరాలను డీఎస్పీ శ్రీధర్ శనివారం వెల్లడించారు. అల్లూరులోని బలిజపాళేనికి చెందిన బండ్ల మోజెస్‌కు జేసీబీని అదే మండలం నార్తుమోపూరులోని ప్రగతినగర్ కాలనీ చెందిన శివయ్య, కావలి రూరల్ మండలం గౌరవరానికి చెందిన శెట్టిపల్లి రఘురామయ్య, దగదర్తి మండలం పెద్దపుత్తేడు పంచాయతీ రామలింగాపురానికి చెందిన షాజహన్ అక్టోబర్ 29 అర్ధరాత్రి చోరీ చేశారు. అనంతరం గౌరవరంలోని పొలాల్లో దాచి విక్రయించేందుకు రఘురామయ్య యత్నించసాగారు. దీనిపై సమాచారం అందుకున్న కావలి రూరల్ సీఐ పాపారావు, అల్లూరు ఎస్సై కిషోర్‌బాబు నిందితులను అరెస్ట్ చేసి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
విద్యుత్ బిల్లులను
నేడూ చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను ఆదివారం యథావిధిగా చెల్లించొచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వ్యక్తిపై కత్తితో దాడి
కావలి: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. కావలి టూ టౌన్ పోలీసుల కథనం మేరకు.. జలదంకి మండలం జమ్మలపాళెం వాసి సురేష్‌కు చెందిన రేగుపండ్లను అడగకుండానే విజయకుమార్ తీసుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన సురేష్‌తో ఘర్షణకు దిగారు. చుట్టుపక్కల ఉన్న వారు గమనించి వారించడంతో విజయకుమార్ వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత సురేష్‌పై వెనుక నుంచి విజయకుమార్ కత్తితో దాడి చేశారు. దాడిలో ఎడమ భుజంపై గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాధితుడు సురేష్ చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవుడి చిత్రపటాలను
తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్
బిట్రగుంట: బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు నుంచి తాళ్లూరు వెళ్లే మార్గంలోని ‘శ్రీవారి పాదాలు’ గుడిలో దేవుడి చిత్రపటాలను తగులబెట్టిన ఘటనలో కొండబిట్రగుంటకు చెందిన నిందితుడు కట్టా ఫకీరయ్యను బిట్రగుంట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గుడిలో చిత్రపటాలను కుప్పగా వేసి గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తగులబెట్టిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటన స్థలాన్ని కావలి డీఎస్పీ శ్రీధర్, రూరల్ సీఐ పాపారావు పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బిట్రగుంట ఎస్సై భోజ్యా, సిబ్బంది సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికుల నుంచి వివరాలను సేకరించి విభిన్నకోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన గుడికి సమీపంలో గేదెల కాపరుల సమాచారం ఆధారంగా కొండబిట్రగుంటకు చెందిన కట్టా ఫకీరయ్యే దేవుడి పటాలను తగులబెట్టారని గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment