నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ కృష్ణకాంత్
కందుకూరు: పోలీస్ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సరైన న్యాయం చేయాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. కందుకూరులోని డీఎస్పీ కార్యాలయంతో పాటు పట్టణ, రూరల్ పోలీస్‌స్టేషన్లను శనివారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు.. కేసుల పరిష్కారంపై పలు సూచనలు చేశారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత వాహనాలను కోర్టుల అనుమతితో వీలైనంత త్వరగా వేలం వేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులు, హత్యలు, లైంగిక, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసుల పరిష్కారమై పలు సూచనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని తెలిపారు. చోరీ కేసులను ఛేదించాలని, కేసుల్లో సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నేర నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. పోలీస్ సిబ్బందికి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment