అల్లీపురం పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్ల నిరసన
నెల్లూరు సిటీ: రూరల్ మండలం అల్లీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం హెల్త్ అసిస్టెంట్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టెర్మినేషన్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కొనసాగుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి సహచర ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. బాధిత హెల్త్ అసిస్టెంట్లు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తమను టెర్మినేషన్ చేయడంతో ఒక్కసారిగా తమ కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్జెంట్లు కె.వి. సుబ్బారావు, ఎస్.చంద్రయ్య, ఓంకారం శ్రీనివాసులు, బి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓగా సుజాత
● పెంచలయ్య బదిలీ
నెల్లూరు(అర్బన్): డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెంచలయ్యను అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2022 మేలో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత లేని లూప్‌లైన్ పోస్టును కేటాయించింది. ఆయన్ను గతంలో ఇక్కడకు డీఎంహెచ్‌ఓగా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీసుకొచ్చారన్నదే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాజకీయ కోణంలోనే ఆయన్ను ప్రాధాన్యత లేని పోస్టుకు పంపారని సమాచారం.
నూతన డీఎంహెచ్‌ఓగా వి.సుజాత
ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆత్మకూరు రూరల్ హెల్త్ అధికారిగా డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో పనిచేస్తున్న వి.సుజాతకు సివిల్ సర్జన్ హోదాలో పదోన్నతి కల్పించి నెల్లూరు జిల్లా డీఎంహెచ్‌ఓగా బదిలీ చేశారు. ఆమె మరో రెండు రోజుల్లో ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సమగ్రశిక్ష ఏపీసీగా
వెంకటసుబ్బయ్య
నెల్లూరు (టౌన్): సమగ్రశిక్ష ఏపీసీగా డి.వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటసుబ్బయ్య ప్రస్తుతం ఉదయగిరిలోని ఎంఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయన రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇక్కడ పనిచేస్తున్న ఉషారాణిని మాతృసంస్ధకు బదిలీ చేశారు. ఈమె 2021 డిసెంబరులో ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు.
సజావుగా ప్రాజెక్టు
కమిటీల ఎన్నిక
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో సాగునీటి సంఘాల ప్రాజెక్టు కమిటీలకు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. జిల్లాలో ఆరు ప్రాజెక్టు కమిటీలు ఉండగా ఐదింటికి ఎన్నికలు నిర్వహించారు. మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకోగా మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకున్నారు. ప్రాజెక్ట్ కమిటీలకు అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నికై న వారికి ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు.
చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా..
పెన్నార్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్‌గా జెట్టి రాజగోపాల్ రెడ్డి.. వైస్ చైర్మన్‌గా బీద గిరిధర్, సోమశిల ప్రాజెక్ట్ కమిటీకి వేలూరు కేశవ చౌదరి, పులుగుంట మధుమోహన్‌రెడ్డి, కనుపూరు కాలువ ప్రాజెక్టు కమిటీకి వద్దినేని చినమస్తానయ్య, తుళ్లూరు రామయ్య, గండిపాలెం ప్రాజెక్టు కమిటీకి అడుసుమల్లి వెంకటసుబ్బయ్య, రాళ్లపాడు ప్రాజెక్టు కమిటీకి ఏలూరు వెంకటేశ్వర్లు, నరాల మాలకొండారెడ్డి, వీఆర్ కోట ఆనకట్ట సిస్టం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్‌గా తలపనేని వెంకట రవీంద్రబాబు, వైస్ చైర్మన్‌గా తోకల మాల్యాద్రి ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment