విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● పొలాల్లో బోల్తాపడిన ఆటో ● దానిని తీసేందుకు సాయం వెళ్లి మృత్యువాత
● దగదర్తి మండలం తడకలూరులో ఘటన
దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలం తడకలూరులో విద్యుదాఘాతంతో ఇద్దరు గిరిజనులు మంగళవారం మృత్యువాత పడ్డారు. ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తాపడిన ఆటోను పైకి తీసేందుకు సాయంగా వెళ్లిన గిరిజనులు దాసరి పోలయ్య (46), మాణికల నరసయ్య (21) కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందటంతో మృతుల కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు తడకలూరుకు చెందిన మనోహర్, మహాలక్ష్మమ్మలు గేదెలకు అవసరమైన పచ్చిగడ్డి కోసం ఆటోలో తలమంచి మేజర్ కాలువ జీప్‌ట్రాక్‌పైన ఆటోలో వెళుతుండగా ఆటో ప్రమాదానికి గురైంది. జీప్‌ట్రాక్‌పైన ఉన్న గోతుల కారణంగా ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. ఆ సమయంలోనే మనోహర్, మహలక్ష్మమ్మలు ఆటోలో నుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పొలాల్లో బోల్తా పడిన ఆటోను పైకి తీసుకువచ్చేందుకు స్థానిక గిరిజనులను సాయం కోరగా తడకలూరు గిరిజన కాలనీకి చెందిన దాసరి పోలయ్య, మాణికల నరసయ్యలు వచ్చారు. ఆటో బోల్తా పడే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తెగి ఆటోపైన పడిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆటోను పైకి తీసేందుకు ప్రయత్నించిన పోలయ్య, నరసయ్యలు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాలు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాయి. పోలయ్యకు భార్య నలుగురు పిల్లలు ఉండగా, నరసయ్యకు ఇంకా వివాహం కాలేదని తెలిసింది. దగదర్తి ఎస్సై జంపాని కుమార్, ట్రాన్స్‌కో ఏఈ దస్తగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment