ఉపాధి పనుల్లో అవినీతిని సహించం
● మార్చి చివరి నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలి
● పీడీ గంగాభవాని
ఉదయగిరి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సిబ్బందితో పాటు మేట్‌లు, క్షేత్ర సహాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ కె.గంగాభవాని హెచ్చరించారు. స్థానిక సీ్త్రశక్తి భవనంలో మంగళవారం ఉదయగిరి క్లస్టర్‌లోని 8 మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల జరిగిన సోషల్ ఆడిట్ తనిఖీల్లో ఉద్యోగులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు వెలుగు చూడడంతో వారిపై చట్టపరంగా కేసులు కూడా పెడుతున్నట్లు తెలిపారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ కనీస వేతనానికి తగిన పని కల్పించాలన్నారు. మెటీరియల్ పనులకు సంబంధించి నిధులు పెరగాలంటే ఉపాధి కూలీల సంఖ్య కూడా బాగా పెంచాలన్నారు. ముఖ్యంగా ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో పనులు నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కేటాయించిన లక్ష్యం మేరకు కూలీలకు పని కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు సాధించని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. జాబ్‌కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు తప్పని సరిగా పని కల్పించాలన్నారు. గోకులం షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పలు మండలాల్లో నిర్దేశించిన లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్నారని, వారి తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఉదయగిరి ఏపీడీ గాయత్రీదేవి, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉదయగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment