ఆక్రమిత భూములపై సర్వే
టీడీపీ నాయకుడి చెరలో 63 ఎకరాలు
● ఉన్నతాధికారులకు నివేదిక
అందజేస్తామన్న జిల్లా సర్వే శాఖ ఏడీ
ఆత్మకూరు: చేజర్ల మండలంలోని పెళ్లేరు గ్రామ రెవెన్యూ (పుల్ల్లనీళ్లపల్లి)లో వివాదాస్పద భూములను జిల్లా సర్వేయర్ నాగశేఖర్, సిబ్బంది బుధవారం పరిశీలించారు. 1976లో 45 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ దళిత కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని దశాబ్దం క్రితం స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని సాగు చేస్తున్నాడు. దీనికితోడు ఈ భూమిని తన కుటుంబీకుల పేరు మీద 1బీ, అండగళ్‌లో మార్చుకున్నాడు. ఈ విషయమై బాధిత దళిత కుటుంబాలు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా యి. గత నెలలో కలెక్టర్‌కు వినతి పత్రాలు కూడా అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు సర్వే శాఖ ఏడీ నాగశేఖర్, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందితో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించి సర్వే నిర్వహించారు. సర్వే నంబరు 509, 508, 510, 511, 512లో సీలింగ్ భూములు 42 ఎకరాలు, ప్రభుత్వ భూములు 21 ఎకరాలను ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 45 కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఆ భూములను టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నారు. ఏడీ నాగశేఖర్ మాట్లాడుతూ ఈ భూములు ప్రభుత్వ, సీలింగ్ భూములేనని, పూర్తి స్థాయి నివేదికను సీసీఎల్‌ఏకు, జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. భూముల సర్వే అనంతరం తూర్పుపల్లి సచివాలయంలో ఇరువర్గాలతో సమావేశమైన క్రమంలో అధికారుల ఎదుటే సదరు టీడీపీ నాయకుడు దళితులతో వాదనకు దిగాడు. ఇరువర్గాలు వాదులాడు కోవడంతో రెవెన్యూ అధికారులు సమావేశం ముగించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సర్వేయర్ పి.శాంత, రంగస్వామి, ఒంటేరు శ్రీను, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment