భూములు కాపాడేందుకు ఏం చేస్తున్నారో చెప్పండి | - | Sakshi
Sakshi News home page

భూములు కాపాడేందుకు ఏం చేస్తున్నారో చెప్పండి

Published Thu, Jan 23 2025 12:23 AM | Last Updated on Thu, Jan 23 2025 12:23 AM

-

సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు మండలం నెల్లేపల్లి గ్రామ పరిధిలో ఉన్న అటవీ భూమిలో దాదాపు 150 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు విచారణలో తేలిన నేపథ్యంలో ఆక్రమణదారుల నుంచి ఆ భూమిని కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందజేయాలని హైకోర్టు బుధవారం అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారితోపాటు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆక్రమణల తొలగింపునకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ తమ ముందు నివేదిక ఉంచాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ.. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాపూరు, నెల్లూరు రేంజ్‌ పరిధిలో ఉన్న పోతుకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిన 150 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని, అయినప్పటికీ ఆక్రమణలను తొలగించడం లేదంటూ వెలుగోను గ్రామానికి చెందిన రైతు అందెన వెంకటరమణయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వైఎల్‌ శివకల్పన రెడ్డి వాదనలు వినిపిస్తూ, నెల్లేపల్లి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో దాదాపు 1200కు పైగా అటవీ భూమి ఉందన్నారు. ఇందులో దాదాపు 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలకు గురైందన్నారు. 40 మంది ఆ భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్త సర్వే ద్వారా కూడా తేల్చారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణలపై అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. శివకల్పన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మా సనం ఆక్రమణల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఓ నివేదికను తమ ముందుంచాలని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

150 ఎకరాల అటవీ భూమి

విషయంలో నివేదిక ఇవ్వండి

అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, నెల్లూరు కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement