స్టీల్ సామాన్ల వ్యాపారి హతం
● గొంతు నులిమి దారుణం
● ఆస్తి వివాదాలే కారణమని సమాచారం
● రెండో కుమారుడిపై అనుమానం
కొడవలూరు: ఆటోలో ఊరూరు తిరుగుతూ స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యాపార నిమిత్తం ఆటోలో వెళ్తుండగా రెండు కార్లలో వచ్చిన నిందితులు అటకాయించి అతని గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మండలంలోని మిక్కిలింపేట వద్ద బుధవారం వేకువ జామున జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం చల్లాయపాళేనికి చెందిన దేవళ్ల రమేష్ (50) ఆటోలో స్టీల్ సామాన్లు వేసుకుని గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తుంటారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇరవై ఏళ్ల క్రితమే భార్యను వదిలేసి తమిళనాడుకు చెందిన మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు అప్పటికే ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా రమేష్ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో ప్లాటు, దుకాణం కొనుగోలు చేశారని సమాచారం. ఇలా సంపాదించిన ఆస్తులను సహజీవనం చేస్తున్న మహిళ సంతానానికి ఇచ్చేస్తున్నారన్న విషయంపై రెండో కుమారుడు మూడు నెలల క్రితం తండ్రితో గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు రమేష్ ఆటోను అటకాయించి గొంతు నులిమి హత్య చేశారు. ఆ సమయంలో రమేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడు రమేష్ పక్కనే ఉన్నారు. ఆ యువకుడు రమేష్ తన రెండో కుమారుడే హత్య చేశారని చెబుతుండడం, మూడు నెలల క్రితం తండ్రి రమేష్‌తో ఆ వ్యక్తి గొడవ పడి ఉండడంతో అతనే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతుడి మొదటి భార్య రెండో కుమారుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment