ప్రశాంతంగా జేఈఈ మెయిన్ పరీక్ష
● తొలిరోజు 1,200 మంది హాజరు
నెల్లూరు (టౌన్): ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 3 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు విడతల్లో జరిగిన పరీక్షకు 1,200 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే విద్యార్థులు పరీక్ష రాసేందుకు కేంద్రంలోకి వెళ్లడంతో వెంట వచ్చిన తల్లిదండ్రులు రోడ్డుపైనే వేసి ఉన్నారు.
అట్రాసిటీ కేసుపై
డీఎస్పీ విచారణ
కలువాయి: కలువాయి పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ బుధవారం విచారణ జరిపారు. కలువాయి మండలం వెరుబొట్లపల్లికి చెందిన కోలా వంశీ మరో యువకుడితో కలిసి ఈ నెల 18న బైక్‌లో వెళుతుండగా గేదెలు అడ్డు వచ్చాయి. వంశీ హారన్ కొట్టాడు. ఎందుకు హారన్ కొట్టావు, గేదెలు పొలంలో పడ్తాయి అంటూ గ్రామానికి చెందిన సంకల పవన్, మరో ఐదుగురు అతన్ని కులం పేరుతో దూషించి దాడి చేశారు. దీనిపై వంశీ పోలీసులకు ఫిర్యాదు మేరకు కలువాయి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ వేణుగోపాల్ బాధితులను కలువాయికి పిలిపించి మాట్లాడారు. గ్రామానికి వెళ్లి విచారించారు.
జెడ్పీలో ఉద్యోగోన్నతులు
నెల్లూరు (పొగతోట): వివిధ మండలాల్లో పనిచేస్తున్న జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పి స్తూ జెడ్పీ సీఈఓ విద్యారమ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ వారికి అందజేశారు. 17 మంది ఆఫీస్ సబార్డినేటర్లకు రికార్డు అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు భీమ్‌రెడ్డి, షేక్ మాబాషా పాల్గొన్నారు.
ప్రొవిజనల్ మెరిట్
జాబితా విడుదల
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల – పెద్దాస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ ఉద్యోగాల కోసం గత డిసెంబర్ 1వ తేదీ నుంచి 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాను spsrnellore.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఆ జాబితాను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 6వ తేదీ సాయంత్రం లోపు నేరుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అందజేయాలని కోరారు. లేదా acsrgmcnlr@gmail.com నందు జతపరిచిన గ్రీవెన్స్‌లో మాత్రమే పంపాలని సూచించారు.
శ్రీవారికి చందనాలంకారం
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి చందనాలంకరణలో భక్తులకు అభయమిచ్చారు. బుధవారం స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మనక్షత్రం కావడంతో స్వామివారి మూల మూర్తికి చందనంతో అలంకరించినట్లు దేవస్థాన ప్రధానార్చకులు తెలిపారు. ఉదయం అభిషేకం, చందన అలంకరణ, 9 గంటలకు శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో శాంతి హోమం, 11 గంటలకు కల్యాణం, 1 గంటకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి బంగారు గరుడ వాహనంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువు దీరి లక్ష్మీనరసింహస్వామి మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
Comments
Please login to add a commentAdd a comment