నీకు సమాధానం చెప్పను
నా ఇష్టం...
బిట్రగుంట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించింది. గతంలో పౌర సేవలకు నిర్దిష్ట కాలపరిమితి విధించి గడువులోగా కచ్చితంగా పని చేసేలా అధికారులపై పర్యవేక్షణ ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో కొంత మంది ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలను పురుగులకన్నా హీనంగా చూస్తున్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో మాజీ సీఎం ఫొటో పెట్టాలని అడిగిన వార్డు సభ్యులపై బోగోలు పంచాయతీ కార్యదర్శి పోలీసు కేసు పెట్టి వేధింపులకు దిగిన విషయం మరిచిపోక ముందే.. ఇంటి పన్ను కట్టేందుకు వచ్చిన వ్యక్తిపై నాగులవరం పంచాయతీ కార్యదర్శి విరుచుకు పడ్డాడు.
ఎస్సైకి ఫోన్ చేసి పిలిపిస్తానంటూ బెదిరింపు
తనకు తానుగా ఇంటి పన్ను కడతానని వస్తే.. ఏం మాట్లాడాతారని ప్రశ్నించడంతో.. ఎక్కువ మాట్లాడితే ఎస్సైకి ఫోన్ చేసి పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాగులవరం పంచాయతీకి చెందిన వ్యక్తి ఇంటి మీద రుణం తీసుకునేందుకు ఇంటి పన్ను చెల్లించిన రసీదులు అవసరం కావడంతో సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌రావును సంప్రదించి ఇంటి పన్ను కట్టించుకోవాలని కోరాడు. ఎందుకు ఇంటి పన్ను కడుతున్నారో తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్ను కట్టించుకునేందుకు నిరాకరిస్తూ దురుసుగా మాట్లాడాడు. ఎందుకు కట్టించుకోరని నిలదీయడంతో ‘దబాయిస్తున్నావేంటి.. నేను కట్టించుకోను.. నువ్వు లోన్ తీసుకుని కట్టకపోతే ఎవరు బాధ్యులు.. లోన్ కోసం కాకపోతే ఎందుకు ఇంత సేపు ఉన్నావ్ ఇక్కడ.. నేను కట్టించుకోను.. నేను అందరికీ డిమాండ్ నోటీసు ఇస్తాను.. అప్పుడు వచ్చి కట్టుకోండి. పంచాయతీ ఆఫీస్‌లోనో.. బ్యాంకులోనో కట్టుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అధికారి అయి ఉండి ఇలా మాట్లాడడం సరికాదు సార్, నిన్న వచ్చినా కూడా మీరు సరిగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు అని బాధిత వ్యక్తి మాట్లాడగా పంచాయతీ కార్యదర్శి మళ్లీ దురుసుగా స్పందించాడు. ‘ సమాధానం చెప్పను, కట్టించుకోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో.. మీరు ఎంప్లాయ్‌ని ఒత్తిడి చేయకూడదు... ఇప్పుడు నేను ఎస్సైకి ఫోన్ చేసి పిలిపిస్తా..’ అంటూ ఇంటి పన్ను కట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తిపైనే బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు కూడా ఎస్సై గారిని పిలిపించండి సార్, నేను మిమ్మల్ని ఏం ఒత్తిడి చేశానో చెప్పండి సార్ అంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం అంతా వీడియోలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమైన ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి వాస్తవాలు తెలుసుకుంటానని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి
దురుసు ప్రవర్తన
ఇంటి పన్ను కట్టేందుకు వచ్చిన వ్యక్తిపై చిందులు
వైరల్‌గా మారిన వీడియో
Comments
Please login to add a commentAdd a comment