హైవే పనుల అడ్డగింత
● పోలీసు రక్షణలో పైరును దున్నేసిన అధికారులు
సీతారామపురం: సాగులో ఉన్న పైరును అధికారులు దున్నడంతో బుధవారం పబ్బులేటిపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన పోరుమామిళ్ల లక్ష్మయ్య అన్నదమ్ములకు సంబంధించిన పొలం ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది. ఐదెకరాల ఉమ్మడి భూమిలో 1.25 ఎకరాల భూమి జాతీయ రహదారి నిర్మాణానికి తీసుకుని నష్టపరిహారం చెల్లించగా, అందులో ఉన్న 23 టేకు చెట్లు, ఓ చింతచెట్టు, బోరు, తెట్టుగోడలకు నష్టపరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం పొలంలో పైరు కూడా సాగు లో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసు బలగాలు, రెవెన్యూ అధికార యంత్రాంగం పబ్బులేటిపల్లికి చేరుకొని ఆ భూమిలోకి ప్రవేశించగా బాధితులు యంత్రాలకు అడ్డుపడ్డారు. కేవలం భూమికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని, పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పొలంలోకి దిగాలని డిమాండ్ చేశారు. తర్వాత చెల్లిస్తామని అధికారులు సర్దిచెప్పినా వినలేదు. ఎట్టకేలకు పోలీసుల ప్రమేయంతో యంత్రాలకు అడ్డుగా ఉన్న వారిని తొలగించి పొలంలోని పైరును దున్నేశారు. కనీసం పైరు కోసుకునే వరకు గడువు కోరినా అటు అధికార యంత్రాంగం, ఇటు రోడ్డు నిర్మాణదారు కనికరించలేదని బాధితులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment