రైతుల పథకాలకు ప్రత్యేక కోడ్
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి
నెల్లూరు(సెంట్రల్): ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో రైతుల పథకాల కోసం నమోదు చేసుకుంటే ప్రత్యేక కోడ్ వస్తుందని, ఆ కోడ్ నంబర్ ఉంటేనే పథకాలు అందుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుకు సంబంధించి పొలం వివరాలను సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో అందించి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సబ్సిడీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంటల రుణాలపై వడ్డీ రాయితీ, పెట్టుబడి సాయం ఇలా ప్రభుత్వం నుంచి ఏ పథకం తీసుకోవాలన్నా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
పశుగణన పూర్తి చేయాలి
నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో జరుగుతున్న పశుగణన ప్రక్రియను ఈ నెల 28వ తేదీ లోపు పూర్తిచేయాలని పశుగణన జిల్లా నోడల్ అధికారి ఆర్.మంజునాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 91 శాతం పూర్తి చేశారన్నారు. పశువుల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉంటే, పాడి రైతులకు వచ్చే పథకాలు కూడా అందజేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. గడువు లోపల పశుగణనకు కేటాయించిన టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయాలని సూచించారు.
సూర్యఘర్ ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● ఎస్‌ఈ విజయన్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం ప్రయోజనాలపై ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కలిగించాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ అధికారులకు సూచించారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఆదివారం సాయంత్రం సోలార్ విద్యుత్ వినియోగంపై రామూర్తినగర్ సబ్‌డివిజన్ డీఈఈ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో సోలార్ వెండర్స్‌తో సోలా ర్ ఎక్స్‌పో ఏర్పాటు చేశారు. ఎస్‌ఈ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు సోలార్ విద్యుత్ ఉపయోగపడుతుందన్నారు. 25 ఏళ్ల గ్యారెంటీతో ఈ సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో పెట్టిన పెట్టుబడి 5 ఏళ్లలో తిరిగి వస్తుందని, మిగిలిన 20 ఏళ్లు విద్యుత్ ఉచితంగా పొందచ్చన్నారు. సూర్య ఘర్ నోడల్ ఆఫీసర్, విద్యుత్‌శాఖ ఈఈ శేషాద్రిబాలచంద్ర, 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్, చిల్డ్రన్స్ పార్క్ పౌండర్ రమణయ్య, ఏఈలు గోపాలకృష్ణ, మునిశేఖర్, సురేష్, విజయ్‌కుమార్, జూనియర్ ఇంజినీర్స్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రులు మంత్రి ఆనం, నారాయణ, జనార్దన్‌రెడ్డి, సవిత, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలో టిడ్కో భవనాల వద్ద నూతన రామాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్‌అండ్ అతిథి గృహాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల గురుకుల పాఠశాల కోసం తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం, సరస్వతీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో ఆనం మాట్లాడుతూ బీసీ బాలికల కోసం గతంలోనే మంజూరైన రెసిడెన్సియల్ పాఠశాల సాంకేతిక కారణాలతో నిలిచిపోయిందన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 63 ప్రాంతాల్లోని టిడ్కో భవనాల వద్ద రామాలయాల నిర్మాణం కోసం రూ.20 లక్షలు చొప్పున దేవదాయశాఖ నిధులతో నిర్మించనుండడం మంచి సాంప్రదాయమన్నారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల కి.మీ.రోడ్లను పీపీపీ పద్ధతి ద్వారా ఏప్రిల్, మే నెలల్లోపు పూర్తి చేయనున్నట్లు తెలిపారు మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రూ.39 వేల కోట్లు నిధులు మంజూరు చేసి 1.39 లక్షల మంది స్వయం ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రి నారాయణ నియోజకవర్గానికి తాను ఎంపీ ల్యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆయనే సమకూర్చుకోగలరన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఆర్డీఓ బి.పావని, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కె శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment