ప్రాక్టికల్స్‌.. ప్రహసనమే | - | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్స్‌.. ప్రహసనమే

Published Mon, Feb 10 2025 12:22 AM | Last Updated on Mon, Feb 10 2025 12:22 AM

ప్రాక

ప్రాక్టికల్స్‌.. ప్రహసనమే

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీయట్‌ జనరల్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. క్షేత్రస్థాయి నుంచి బోర్డు స్థాయి వరకు ఒప్పందాలు జరిగిపోవడంతో ప్రాక్టికల్స్‌.. ఒక ప్రహసనమే అని స్పష్టమవుతోంది. ప్రాక్టికల్స్‌ పరీక్షలను సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహిస్తున్నామని గొప్పగా చెబుతున్నప్పటికీ.. అదే సీసీ కెమెరాల మాటున మాస్‌ ప్రాక్టికల్స్‌ జరగబోతున్నాయని సమాచారం.

ప్రాక్టికల్స్‌కు 23,507 మంది విద్యార్థులు

ఇంటర్మీడియట్‌ జనరల్‌ ప్రాక్టికల్స్‌కు మొత్తం 23,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. బైపీసీ 19,864 మంది, ఎంపీసీ 3,823 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్‌ ఉందయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. మొత్తం 121 సెంటర్లలో రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ నిర్వహించేందుకు 121 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 121 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను, సుమారు 400 మంది ఎగ్జామినర్లను నియమించారు.

విద్యార్థుల నుంచి డబ్బుల వసూళ్లు

ప్రాక్టికల్స్‌ పేరుతో ఆయా కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలిసింది. బైపీసీ విద్యార్థులు అయితే రూ.2 వేలు, ఎంపీసీ విద్యార్థులు రూ.1000 వంతున ఇచ్చినట్లు విద్యార్థులే చెబుతున్నారు. ప్రాక్టికల్స్‌లో బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులుంటాయి. అయితే కార్పొరేట్‌ విద్యార్థులకు కనీసం రసాయనాలు పేర్లు కూడా తెలియదని చెబుతున్నారు. కార్పొరేట్‌ జూనియ ర్‌ కళాశాలల యాజమాన్యాలు అనాథరైజ్డ్‌ బ్రాంచ్‌ల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అనాథరైజ్డ్‌ బ్రాంచ్‌లో ఉన్న విద్యార్థులు ప్రాక్టికల్స్‌ కోసం అడ్మిషన్‌ ఉన్న బ్రాంచ్‌కు వచ్చి ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మెజార్టీ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించని పరిస్థితి ఉంది. ఒక వేళ బిగించినా వాటి దిశ మార్చి యథేచ్ఛగా ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ చేస్తున్న పరిస్థితి ఉంది.

ముందే ఒప్పందం

కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ముందుగానే ఇంటర్‌ బోర్డు అధికారులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. రూ.లక్షల్లో చేతులు మారాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రాక్టికల్స్‌కు వచ్చిన ఎగ్జామినర్‌కు ఒక్కో విద్యార్థికి రూ.300 నుంచి రూ.500 వరకు అందజేస్తున్నట్లు తెలిసింది. ఆయా యాజమాన్యాలు ముందుగానే విద్యార్థులకు మైక్రో జెరాక్స్‌లు చేయించి ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సెంటర్లలో నేరుగా ఎగ్జామినర్లే చెబుతున్న పరిస్థితి ఉంది. ఏ పూట జరిగే పరీక్షకు ఆ పూటే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండడంతో ఈ అక్రమాలు బయటపడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇన్ని సెంటర్లలో పరీక్షలు జరుగుతుంటే కేవలం 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లే నియమించడం చూస్తే ప్రాక్టికల్స్‌ ఎంత పారదర్శంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు ముందు నుంచే కార్పొరేట్‌, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌ బోర్డు అధికారుల మధ్య ఒప్పందాలు కుదిరిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తమ విద్యార్థులకు చెప్పిన విధంగా మార్కులు వేసేందుకు వారితో అవగాహన కుదుర్చుకున్న విషయం ఓపెన్‌ సీక్రెట్‌. ప్రాక్టికల్స్‌ వెళ్లి మీకు తెలిసింది చేయండి.. ఆ తర్వాత మేం చూసుకుంటాం అని విద్యార్థులకు చెబుతున్నట్లు తెలిసింది. నాన్‌ జంబ్లింగ్‌ పద్ధతిలో ఏ కళాశాల విద్యార్థులు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారంటే ఈ పరీక్షల్లో పారదర్శకత ఎక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పకడ్బందీగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు

హాజరుకానున్న 23,507 మంది విద్యార్థులు

121 సెంటర్ల ఏర్పాటు

ఫిర్యాదులకు కంట్రోలు రూం ఏర్పాటు

4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ జనరల్‌ ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంటర్‌ జనరల్‌ ప్రాక్టికల్స్‌ ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయన్నారు. 20వ తేదీ రిజర్వ్‌గా ఉంటుందన్నారు. ఈ పరీక్షకు జిల్లాలో 23,507 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్‌ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 121 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ప్రాక్టికల్స్‌ జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాక్టికల్స్‌కు 121 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 121 మంది అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించినట్లు చెప్పారు. చీఫ్‌ సూపరింటెండెంట్లుగా ప్రభు త్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు, అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లుగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్స్‌ను నియమించారన్నారు. 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కంట్రోలు రూంను ఏర్పాటు చేశామన్నారు. 0861– 2320312 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే అందుబాటులోకి వస్తారన్నారు. ఫీజులతో ముడిపెట్టకుండా విద్యార్థులకు హాల్‌ టికెట్లు అందజేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీవీఈఓ మధుబాబు, డీఈసీ సభ్యులు దీన్‌దయాళ్‌, వేణుగోపాల్‌, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నాన్‌ జంబ్లింగ్‌ పద్ధతిలో నిర్వహణ

ఏ కళాశాల విద్యార్థులు

ఆ కళాశాలలోనే పరీక్షలు

సీసీ కెమెరాల సాక్షిగా మాస్‌ కాపీయింగ్‌కు ప్లాన్‌

ఎగ్జామినర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో ముందే ఒప్పందం

బైపీసీ విద్యార్థి నుంచి రూ.2 వేలు, ఎంపీసీకి రూ.1,000

సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాం

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను బిగించాలని ఆదేశాలు జారీ చేశాం. ఆర్‌ఐఓ కార్యాలయం నుంచి ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షిస్తాం. ప్రాక్టికల్స్‌ కోసం 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 4 డీఈసీ కమిటీ సభ్యులను నియమించాం. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆదూరు శ్రీనివాసులు, ఆర్‌ఐఓ

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాక్టికల్స్‌.. ప్రహసనమే 1
1/1

ప్రాక్టికల్స్‌.. ప్రహసనమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement