కావలి: పట్టణంలోని ముసునూరులో ఉన్న కస్తూర్బా బాలికా విద్యాలయంలో సోమవారం ఉమెన్స్ ఫోరం బృందం పర్యటించింది. విద్యాలయంలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు ఆగంతకులు ముసుగులు ధరించి, మారణాయుధాలతో దూరి తెల్లవారు జాము వరకు కీచక కాండకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో ఉమెన్స్ ఫోరం బృందం కన్వీనర్ సి. శారదతోపాటు సభ్యు లు ఇలీంద్ర లావణ్య, షేక్ ఫాతిమా, టీ సుజాత, షేక్ బుష్రా విద్యాలయం పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతోపాటు ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లా డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 260 మందికిపైగా విద్యార్థినులు ఉండే ఈ పాఠశాల ఊరి చివరగా పడమటి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసినట్లు ఉందని తెలిపారు. 24/7 విద్యార్థులకు రక్షణ కల్పించాలని, ఆడపిల్లలపై అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డార్మెటరీ లేకపోవడంతో తరగతి గదుల్లో, డైనింగ్ హాల్‌లో నిద్రించాల్సి వస్తుందన్నారు. శనివారం రాత్రి ఘటనలో ఆగంతకులు విద్యార్థినుల జడలు లాగి ఒకడు పైనబడి అరాచకం చేసినట్లు తెలిసిందన్నారు. ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడు తూ బాలికలు ఉండే రెసిడెన్షియల్ స్కూల్ ఊరవతల ఉండడం భద్రత కాదని ఉమెన్స్ ఫోరం ప్రతినిధులు చెప్పినట్లు వివరించారు. ఇద్దరు వాచ్ ఉమన్ , ఇద్దరు కుక్స్, ఇద్దరు టీచర్లకు మార్చి మార్చి డ్యూటీలు వేస్తుంటామని తెలిపారు. ఉమెన్స్ ఫోరం కన్వీనర్ సి. శారదతో కలిసి వెళ్లిన ప్రతినిధులు పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ఆగంతకులను తక్షణమే పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కస్తూర్బా స్కూల్‌ను సందర్శించారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఆ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులకు రాత్రింబవళ్లు రక్షణ కల్పించేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌కు రాత్రి డ్యూటీ వేసి బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment