![కస్తూర్బాలో అర్ధరాత్రి కీచకకాండ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09kvl33-240016_mr-1739127037-0.jpg.webp?itok=EGRymhIA)
కస్తూర్బాలో అర్ధరాత్రి కీచకకాండ
కావలి: పట్టణంలోని ముసునూరు కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలోకి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగులు ధరించిన ముగ్గురు ఆగంతకులు మారణాయుధాలతో ప్రవేశించి కీచక కాండకు తెగబడ్డారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించి తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. వసతిగృహం వెనుక వైపున ఉన్న గోడదూకి హాస్టల్‌లోకి ప్రవేశించిన దుండగులు విద్యార్థినుల గదుల్లోకి దూరి అలజడి సృష్టించడంతో వారు భయంతో బిక్కచచ్చిపోయారు. ముఖం కనిపించకుండా ముసుగులు ధరించడంతోపాటు చేతుల్లో కత్తులు ఉండడంతో భయంతో వణికిపోయారు. విద్యార్థినుల అరుపులతో ఆగంతకులు పారిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్‌తో సహా పోలీసులు కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. విద్యార్థినులను మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డారు.
మూడు గంటల సేపు పైశాచికత్వం
ఆగంతకులు ముగ్గురు సుమారు మూడు గంటల సేపు విద్యార్థినులకు నరకం చూపించినట్లుగా తెలిసింది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత హాస్టల్‌లోకి ప్రవేశించిన అగంతకులు డైనింగ్ హాల్‌లో పడుకున్న విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. వారు కప్పుకున్న దుప్పట్లు లాగేసి, జడలు లాగుతూ వేకువన 3 గంటల వరకు పైశాచికత్వం ప్రదర్శించారు. అరిచిన కొందరి విద్యార్థులను చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. మూడు గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి తిరిగి వెళ్లిపోయారు.
పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు
కస్తూర్బాలో 262 మంది బాలికలు ఉన్నారు. వీరు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు వీరంగం చేయడంతో భయంతో వణికిపోయిన విద్యార్థినులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఉదయాన్నే హుటాహుటిన వసతిగృహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవ డం, చిన్నారులు భయంతో మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. హాస్టల్‌లో ఉంటే బాలికలకు రక్షణ లేదంటూ ఖాళీ చేయించి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
భద్రతా వైఫల్యం.. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం
కస్తూర్బాలో 262 మంది విద్యార్థినులు ఉంటే.. కనీసం పాఠశాల యాజమాన్యం వారి భద్రతపై ఎటువంటి చర్య లు తీసుకోకవడం విమర్శలకు తావిస్తోంది. రెండో శనివారం కావడంతో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితోపాటు వసతి గృహం వార్డెన్ సైతం పాఠశాలల ప్రాంగణంలో లేకపోవడం చూస్తే విద్యార్థునుల భద్రత పట్ల ఈ ప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం ఎటువంటి శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ముగ్గురు ఆగంతకులు తమ గదుల్లోకి దూరి అలజడి సృష్టించారని విద్యార్థినులు చెబుతున్నప్పటికీ ప్రిన్సిపల్ మాత్రం ఒక్కడే వచ్చాడంటూ ఈ ఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మంది విద్యార్థినులకు ఒకే ఒక వాచ్‌మెన్‌ను నియమిస్తే.. అతను సైతం ఆ సమయంలో ఎటుపోయాడో తెలియడం లేదు. ఈ ఘటన కస్తూర్బా యాజమాన్యం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు, కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉండడం గర్హనీయం. పోలీసులు విచారణ జరపడంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతోపాటు నిందితులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మారణాయుధాలతో
ముగ్గురు ఆగంతకుల కలకలం
గోడ దూకి వసతిగృహంలో దూరి
విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తన
భయంతో వణికిపోయిన బాలికలు
విషయం తెలిసి పాఠశాలకు వచ్చిన
తల్లిదండ్రుల ఆందోళన
వసతిగృహం నుంచి ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment