విలేకరులతో మాట్లాడుతున్న కదిరి వైఎస్సార్‌సీపీ నాయకులు, కౌన్సిలర్లు
పుట్టపర్తి అర్బన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన కదిరిలో టీడీపీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్, అతని అనుచరుల ఆగడాలతో ప్రశాంతత కరువైందని ఖాద్రీ ఆలయ చైర్మన్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్, ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. కదిరి నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో విచ్చేసిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఈ మేరకు ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు ఎస్పీతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల క్రితం ఆలయ కార్యనిర్వహణాధికారి, కమిషనర్ ఆదేశాల మేరకు మాఢ వీధుల్లో ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ సిబ్బంది ప్రారంభించారన్నారు. ఈ సమయంలోనే కందికుంట, అతని అనుచరులు వచ్చి పనులను అడ్డుకోవడంతో పాటు అధికారులను, సిబ్బందిని దుర్భాషలాడారని తెలిపారు. పరుష పదజాలంతో దూషించి హెచ్చరికలు జారీ చేశారని, దీంతో వెంటనే మున్సిపల్ కమిషనర్, ఈఓ స్పందించి పోలీసుల సహకారంతో పనులు చేయించారన్నారు. అనంతరం కందికుంట వెంకటప్రసాద్ నేరుగా వచ్చి పనులను అడ్డుకున్నారన్నారు. ఆయన అధికారులను బెదిరించడం ఇది మొదటి సారి కాదని, ఇలాగే పలుమార్లు చేశారన్నారు.
సీఐ ఇంట్లోకి చొరబడ్డారు
కందికుంటతో పాటు అతని అనుచరులు కొంత మంది ఈనెల 25వ తేదీ సాయంత్రం సీఐ మధు ఇంట్లోకి అక్రమంగా చొరబడి సీఐని, వారి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురి చేశారని కౌన్సిలర్లు తెలిపారు. అడ్డుగా వచ్చిన స్థానికులను బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారన్నారు. సీఐని ఇనుప రాడ్డుతో గాయపరిచి బెదిరించారని, సీఐ పైనే ఇలా దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఆదినుంచీ అతనిది నేరప్రవృత్తే..
కందికుంటది ఆది నుంచీ నేర ప్రవృత్తేనని కౌన్సిలర్లు ఎస్పీకి తెలిపారు. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్లతో కుమ్మకై ్క... డీడీలు తస్కరించి అరెస్టయిన వ్యక్తన్నారు. వివాదాస్పద స్థలాల్లో తలదూర్చి సామాన్యుల నుంచి రూ.లక్షలు గుంజడమే పనిగా పెట్టుకున్నారని, కందికుంట దొంగ పనులను సీఐ మధు అడ్డుకుంటున్నాడని, అందుకే ఆయన్ను చంపాలని ప్లాన్ వేశాడన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో మాట్లాడుతూ.... సివిల్ డ్రెస్‌లో వస్తే సీఐ మధు గొంతు కోస్తామని చెప్పాడన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్పీకి చూపించారు. దుర్మార్గుడైన కందికుంటపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు కదిరి ప్రజానీకాన్ని కాపాడాలని కోరారు. కదిరిలో బ్రహ్మరథోత్సవంతో పాటు త్వరలోనే సుమారు 4 లక్షల మంది ముస్లిం సోదరులు కలిసే ఇస్తమా సైతం ఉంటుందని, వాటిని శాంతియుతంగా జరుపుకోవడానికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని కోరారు.
అల్లర్లకు పాల్పడితే సహించేది లేదు
ఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్, ఏఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కదిరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లర్లలో పాల్గొనకుండా శాంతియుతంగా ఉండాలని, అసాంఘిక శక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త పరికి సాదిక్, వైస్ చైర్మన్లు రాజశేఖరరెడ్డి, శంకర్, కౌన్సిలర్లు కృపాకర్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, ఇలాహి, మహమ్మద్, ఫయాజ్, నౌషద్, బొబ్బిలి రవి, ఇస్మాయిల్, మురళీ, నూరుల్లా, ఖాశీం తదితరులు ఉన్నారు.
కదిరి మున్సిపల్ కౌన్సిలర్ల ఆవేదన
టీడీపీ నేత ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు
సీఐ గొంతు కోస్తానన్న కందికుంట వీడియోను ఎస్పీకి చూపించిన వైనం
Comments
Please login to add a commentAdd a comment