నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు శనివారం పరీక్ష నిర్వహించనున్నట్లు లేపాక్షి విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 7,987 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 4,556 మంది బాలురు, 3,431 మంది బాలికలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అనంతపురం జిల్లాలో 15, శ్రీసత్యసాయి జిల్లాలో 19 చొప్పున మొత్తం 34 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
ఎండుమిర్చి @ రూ.16 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 104 క్వింటాళ్ల ఎండు మిర్చి వచ్చింది. ఈ–నామ్ పద్ధతిలో వేలం పాటలు నిర్వహించగా, మొదటి రకం ఎండుమిర్చి క్వింటా రూ.16 వేలు, రెండో రకం క్వింటా రూ.8 వేలు, మూడో రకం ఎండుమిర్చి క్వింటా రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు నాణ్యమైన సరకు తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని రైతులకు ఆయన సూచించారు.
ఖాద్రీశుడి హుండీ ఆదాయం రూ.82 లక్షలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 58 రోజులకు గానూ రూ.82,14,097 నగదు, 8 గ్రాముల బంగారం, 406 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈఓ వెండి దండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే 60 అమెరికా డాలర్లు, 10 కెనడా డాలర్లు హుండీ ద్వారా భక్తులు స్వామికి సమర్పించారన్నారు. గతంతో పోలిస్తే ఈసారి హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చలపతి, బ్యాంక్, ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment