చిలమత్తూరు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయకుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనతో పాటు సీనియర్ సహాయకుడు కుళ్లాయిస్వామిపైనా వేటు వేశారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం భూములకు రిజిస్ట్రేషన్లు చేయడంతో కొందరు బాధితులు ఆధారాలతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వెంకటనారాయణ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మండలంలోని కొన్ని భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వాటికి వెంకటనారాయణ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. అలాగే ప్రీహోల్డ్ భూములను సంబంధం లేని లింక్ డాక్యుమెంట్లు జతపరిచి రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారాల్లో సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణకు సీనియర్ అసిస్టెంట్ కుళ్లాయిస్వామి కూడా సహకరించినట్లు గుర్తించి ఇద్దరిపైనా వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, వెంకటనారాయణ గతంలో బుక్కపట్నంలో పనిచేస్తున్న సమయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్ అయ్యారు. తిరిగి విధుల్లో చేరినా పాత పంథా వదల్లేదు.
Comments
Please login to add a commentAdd a comment