‘ప్రచార’ పనిమంతులు
ధర్మవరం: కూటమి నేతలు ప్రచార పనిమంతులుగా పేరుపొందుతున్నారు. 8 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చేపట్టని నేతలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన బత్తలపల్లి, ముదిగుబ్బ మండల కేంద్రాలలో బైపాస్ రోడ్డు పనులు, బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ వరకు నేషనల్ హైవే నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు గత వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కృషితో పూర్తికాగా, వాటిని తామే చేసినట్లు కూటమి నాయకులు, బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటూ జనం ముందు నవ్వులపాలవుతున్నారు.
ధర్మవరంపై ప్రత్యేక శ్రద్ధ
పట్టుచీరలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ధర్మవరం అభివృద్ధిపై గత వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మున్సిపాలిటి పరిధిలో 40 వార్డుల్లో రోడ్లు వేశారు. అలాగే దశలవారీగా శివారు ప్రాంతాలకు రహదారులను ఏర్పాటు చేశారు. ఇక నియోజకవర్గాన్ని ఇతర నగరాలతో కలిపేందుకు వీలుగా జాతీయ రహదారుల నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే ముదిగుబ్బ నుంచి ఎన్‌ఎస్‌పీ కొట్టాల వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సీఎం జగన్ ఆదేశాలతో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్‌లు ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి నిధులు రాబట్టారు. 2023 జూన్ 10వ తేదీన అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ బత్తలపల్లి–ముదిగుబ్బ జాతీయ రహదారి పనులకు, ముదిగుబ్బ బైపాస్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఆ తర్వాత నాలుగు వరుసల రహదారితో పాటు చిత్రావతి లెవల్ క్రాసింగ్ బ్రిడ్జితో పాటు అనేక బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. అలానే ముదిగుబ్బ బైపాస్‌రోడ్డు పనులపై దృష్టి సారించి పూర్తి చేయించారు. ఈ పనులన్నీ సార్వత్రిక ఎన్నికలకు ముందే పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రారంభానికి నోచుకోలేదు.
ఇటీవల జాతికి అంకితం చేసిన ప్రధాని
నియోజకవర్గంలో పూర్తయిన రహదారులను ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 8న జాతికి అంకితం చేశారు. దీంతో కూటమి నాయకులు, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈ ఘనత తమ ప్రభుత్వానికి, తమ నాయకులకే దక్కుతుందని ప్రచారం చేశారు. దీన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కనీసం ఒక్క రహదారి నిర్మాణం కూడా చేపట్టకుండా ఇలా గొప్పలు చెప్పుకోవడం సరికాదని పలువురు చర్చించుకుంటున్నారు.
ధర్మవరంలో కూటమి నాయకుల పబ్లిసిటీ పిచ్చి
గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి
పనులకు పేటెంట్
వైఎస్సార్ సీపీ హయాంలో వివిధ రోడ్ల నిర్మాణాలు
ఇటీవల జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
క్రెడిట్ తమదేనంటూ కూటమి నేతల ప్రచారం
విస్తుపోతున్న జనం
అన్నీ గతంలో చేసిన పనులే
వైఎస్సార్ సీపీ హయాంలోనే బత్తలపల్లి నుంచి ముదిగుబ్బకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరిగింది. ఈ రహదారి నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు అతితక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరడం వీలవుతోంది. కానీ ఈ రహదారి పనులు తామే చేపట్టినట్లు బీజేపీ శ్రేణులు చెప్పుకోవడం దారుణం. కొత్త రహదారులను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేసుకుంటే బాగుంటుంది.
–గుమ్మళ్లకుంట జయరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, బత్తలపల్లి
ప్రచారం విడ్డూరం
ముదిగుబ్బలో బైపాస్‌రోడ్డు కేతిరెడ్డి కృషితో సాకారమైంది. ఈ రహదారి కోసం మండల ప్రజలు ఎంతగానో వేచిచూశారు. ఈ రహదారి అందుబాటులో రావడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. కేవలం కేతిరెడ్డి ముందు చూపుతోనే రహదారి నిర్మాణం సాకారమైంది. దాన్ని బీజేపీ శ్రేణులు, కూటమి నాయకులు వారి గొప్పలుగా చెప్పుకోవడం విడ్డూరం.
–సీవీ నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, ముదిగుబ్బ
Comments
Please login to add a commentAdd a comment