పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం
● ప్రతి నెలా మూడో శనివారం
‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజారోగ్యంతో పాటు పర్యావరణం కాపాడాలని, ఇందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. అపరిశుభ్రతను రూపుమాపే లక్ష్యంతో ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సంబంధిత జిల్లా శాఖల అధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమం అమలు, ముందుస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో ఏడాది పాటు క్రమం తప్పకుండా ప్రతి మూడో శనివారం కార్యక్రమం నిర్వహించాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడి దారులను మరింత ఆకర్షించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నరసయ్య, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, కో ఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఏకసభ్య కమిషన్ రాక
అనంతపురం అర్బన్: ఎస్సీల్లో ఉపకులాల వర్గీకరణపై విచారణ నిర్వహించేందుకు ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకపభ్య కమిషన్ ఈ నెల 19న అనంతపురం విచ్చేయనుంది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బసచేస్తారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు అధికారులతో సమావేశం, ఎస్సీ సంఘాలు, ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment