అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చేతన్ సూచన
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
పుట్టపర్తి అర్బన్/ప్రశాంతి నిలయం: జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చేతన్ సూచించారు. ముఖ్యంగా మంగళ, బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విపత్తు సమయాల్లో ప్రజలకు సాయం అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగినా 08555–289039/939299719 నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చన్నారు.
సోమవారం ఆయన పుట్టపర్తిలోని సాయిఆరామంలో విలేకరులతో మాట్లాడారు. తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెండు రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. శిథిల భవనాలలో నివశించే వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటికి రాకూడదన్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, ఆహారం, తాగునీరు, రవాణా, వైద్యం తదితర అవసరమైన సేవలను అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాల వైపు, నీటి గుంతల వైపు వెళ్లరాదన్నారు.
పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులు..
గ్రామాల్లో పైప్‌లైను లీకేజీలుంటే వెంటనే మరమ్మతులు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సమత సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో అంటురోగాలు ప్రబలకుండా పారిశుధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు.
కోతలు వాయిదా వేసుకోవాలి..
జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వేరుశనగ కోతలు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు సూచించారు. కోతలు కోసి ఉంటే ఉత్పత్తులను టార్పాలిన్‌తో కప్పి ఉంచాలన్నారు. జిల్లాలో పశువుల, గొర్రెలు, మేకల కాపర్లు రైతులు తుపాను సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి శుభదాస్ సూచించారు.
గర్భిణులకు ఇబ్బందులు కలగొద్దు..
భారీ వర్ష సూచన నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా ఇప్పటికే గుర్తించిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా 443 మంది గర్భిణీల జాబితాను ఆయా ఆస్పత్రులకు పంపామని, వారి ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో జనరేటర్లు, యూపీఎస్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment