అన్న చెప్పాడు.. ఆక్రమిస్తున్నాం! | - | Sakshi
Sakshi News home page

అన్న చెప్పాడు.. ఆక్రమిస్తున్నాం!

Published Sat, Oct 19 2024 12:30 AM | Last Updated on Sat, Oct 19 2024 12:30 AM

అన్న

రాప్తాడురూరల్‌: కాదేదీ కబ్జాకు అనర్హమన్నట్టుగా రెచ్చిపోతున్నారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములు, స్థలాలు, చివరకు ప్రైవేటు ఆస్తులను సైతం కబ్జా చేస్తున్నారు. శ్మశానాలనూ వదలడం లేదు. వీరి అకృత్యాలకు శవాలు సైతం ఘోషిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం రూరల్‌ మండలంలో టీడీపీ నాయకుల దూకుడు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ భూములు, స్థలాలను భారీగా చెరబడుతున్నారు. తాజాగా శుక్రవారం అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లిలో శ్మశాన స్థల దురాక్రమణ వెలుగులోకి వచ్చింది. స్థానిక బీఎన్‌ఆర్‌ కాలనీ ఎదురుగా ఉన్న దళితుల శ్మశాన స్థలంపై కన్నేసిన ‘తమ్ముళ్లు’ .. జేసీబీసాయంతో చదును చేయించారు. దళితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా..ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్దార్థ్‌ పేరు చెప్పి భయపెట్టారు. ‘అన్న చెప్పాడు..మేము చదును చేయిస్తున్నాం. ఏదైనా ఉంటే అన్నతోనే మాట్లాడుకోండి. తహసీల్దార్‌తోనూ అన్న మాట్లాడాడు. మీరు ఏమి చేసినా పనులు నిలబెట్టేది లేదు’ అంటూ తెగేసి చెప్పారు. దీంతో దళితులు వెంటనే తహసీల్దార్‌ మోహన్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు.

2008లో రెండు ఎకరాల కేటాయింపు

దళితుల శ్మశాన వాటిక కోసం రాచానపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 83–3లో రెండు ఎకరాల భూమిని 2008 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. రాచానపల్లి నుంచి అక్కంపల్లికి వెళ్లే దారిలో రోడ్డుపక్కనే ఈ శ్మశాన వాటిక ఉంది. ఇప్పటికే ఇక్కడ పలువురి మృతదేహాలను ఖననం చేశారు. 70 దాకా సమాధులు వెలిశాయి. ఇంకా ఎకరం దాకా స్థలం ఖాళీగా ఉంది. దీన్ని టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. అనంతపురం నగర శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల దాకా పలుకుతోంది. తద్వారా సుమారు రూ.3 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేయడానికి పూనుకున్నారు. పరిటాల సిద్దార్థ్‌ పేరు చెబుతూ పట్టపగలే చదును చేయిస్తున్నారు.

తహసీల్దార్‌ మోహన్‌కుమార్‌

ఏమంటున్నారంటే..

‘‘శ్మశాన భూములను సంరక్షించే బాధ్యత పంచాయతీ అధికారులదే. రాచానపల్లిలో దళితుల శ్మశాన స్థలాన్ని చదును చేయిస్తున్నారంటూ కొందరు నాకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శితో మాట్లాడా. వీఆర్‌ఓతో కలసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పా. శ్మశాన స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సంబంధిత పంచాయతీ కార్యదర్శులదే. చదును చేసేందుకు నేను కూడా అనుమతి ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’’

క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం

దళితుల శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు చదును చేసినట్లు తెలిసింది. గ్రామసభ ఉండడంతో ఆవైపు వెళ్లలేదు. తహసీల్దార్‌ నుంచి ఫిర్యాదు లేఖ అందింది. శనివారం ఉదయం వీఆర్‌ఓ, సర్వేయర్‌తో కలసి శ్మశాన స్థలాన్ని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తాం. చుట్టూ పెన్సింగ్‌ వేయిస్తాం. చదును చేయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. పంచాయతీ స్థలాల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించం.

– మహమ్మద్‌ రఫి, పంచాయతీ కార్యదర్శి, రాచానపల్లి

దళితుల శ్మశానానికి ఎసరు

టీడీపీ చోటా నాయకుల బరి తెగింపు

పరిటాల సిద్దార్థ్‌ పేరుతో కబ్జా

No comments yet. Be the first to comment!
Add a comment
అన్న చెప్పాడు.. ఆక్రమిస్తున్నాం!1
1/1

అన్న చెప్పాడు.. ఆక్రమిస్తున్నాం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement