కాంతులీనిన ప్రశాంతి నిలయం
ప్రశాంతి నిలయం: దీపావళి పర్వదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి యజుర్ మందిరం వద్ద వివిధ ఆకృతులలో దీపాలు వెలిగించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు బాణసంచా కాల్చి వేడుకలు ప్రారంభించారు. అనంతరం సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు, ఉద్యోగులు రంగు రంగుల కాంతులను వెదజల్లే టపాసులను కాలుస్తూ సందడి చేశారు.
ఘనంగా గుజరాతీ
నూతన సంవత్సర వేడుకలు
గుజరాత్ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం గుజరాత్ భక్తులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను అనుసరిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ‘ది గ్లోరీ ఆఫ్ మహాశక్తి’ పేరుతో సూరత్‌కు చెందిన శ్రీ సత్యసాయి స్కూల్ విద్యార్థులు నిర్వహించిన నృత్యరూపకం ఆహూతులను అలరించింది. అనంతరం ఆహ్మదాబాద్‌కు చెందిన బాలవికాస్ బాలికలు ‘గరాబా’ జానపద నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నారు.
దీపావళి.. ఆనందాల కేళి
పుట్టపర్తి టౌన్: దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లాకు నూతన శోభ వచ్చింది. ముంగిళ్లు దీపాల వెలుగులతో కాంతులీనాయి. ఊరూవాడా బాణసంచా మోతతో హోరెత్తాయి. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరూ బాణసంచా పేలుస్తూ ఆనందంలో మునిగితేలారు. అలాగే ఇంటింటా, వ్యాపార సంస్థల్లోనూ లక్ష్మీ పూజలు జరిగాయి. కదిరి, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి తదితర పట్టణాల్లోని ఆలయాల్లో లక్ష్మీ పూజలు వైభవంగా సాగాయి. దీపావళి అమావాస్య సందర్భంగా పలు ప్రాంతాల్లో సామూహిక నోములు, గౌరీ వ్రతాలను మహిళలు నియమనిష్టలతో ఆచరించారు.
Comments
Please login to add a commentAdd a comment