నాడు అమోఘం.. నేడు అధ్వానం
పుట్టపర్తి: ప్రభుత్వ విద్యారంగంపై కూటమి సర్కార్ శీతకన్ను వేసింది. మౌలిక వసతులు కల్పించి.. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది బోధనా ప్రమాణాలు పెంచింది. మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి సదుపాయాలు కల్పించింది. అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేల సాయం అందించింది. పేద పిల్లల చదువులపై తల్లిదండ్రులకు భారం తగ్గింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 2028 ప్రభుత్వ పాఠశాలల్లో 1,47,500 మంది విద్యార్థులు చదువుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలకే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2011కు పడిపోయింది. విద్యార్థుల సంఖ్య 1,25,000కు తగ్గిపోయింది. దీన్ని బట్టి పేదలు చదువుకునే పాఠశాలలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసిపోతోంది.
పౌష్టికాహారంలో కోత..
ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ సరిగా అమలు కావడం లేదు. మెనూ ప్రకారం రోజుకో రకమైన భోజనంతో పాటు చిక్కీలు, కోడిగుడ్లు అందించాలి. అయితే నాలుగు నెలలుగా చిక్కీలు, కోడిగుడ్డు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు అరకొర పౌష్టికాహారంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న కూటమి పార్టీలకు చెందిన వారు పాఠశాలలకు పూర్తిస్థాయిలో సరఫరా చేయకుండా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలతో విరాజిల్లాయి. ‘మన బడి నాడు–నేడు’ కింద పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో తొలి విడత కింద ఎంపికై న 596 పాఠశాలల్లో రూ.171.72 కోట్లు ఖర్చు చేసి..తరగతి గదుల ఆధునికీకరణ, నూతన గదుల నిర్మాణం, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, స్మార్ట్ టీవీలు వంటి పలు సౌకర్యాలు కల్పించారు. అలాగే రెండోవిడత కింద 1,081 పాఠశాలల్లో రూ.316.56 కోట్లతో సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఈ పనులు సాగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారింది. వీటి గురించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. కనీసం మరుగుదొడ్ల నిర్వహణను కూడా చూడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయించారు. స్కూల్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టేలా చూశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేదా ఇద్దరు ఆయాలను నియమించుకుని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. ఆయాలకు కూడా కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో వారు అరకొరగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment