దేశ సమైక్యతను కాపాడాలి
పుట్టపర్తి టౌన్: ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ దేశ సమైక్యతను కాపాడాలని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారం పుట్టపర్తిలో జాతీయ ఐక్యత దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ టీఎస్ చేతన్ ఎస్పీ రత్నతో కలిసి సత్యసాయి సూపర్ ఆస్పత్రి వద్ద యూనిటీ ఫర్ రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి విద్యార్థులతో జాతీయ సమైక్యత దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పటేల్ జీవిత చరిత్రను స్మరించుకున్నారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పరుగు పందెంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగి దేశమని, భారతీయులంతా ఒక్కటేనన్న భావంతో మెలగాలన్నారు. విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శప్రాయుడని, దేశ రక్షణకు, సమగ్రతకు ఆయన ఎంతో కృషి చేశారని కీర్తించారు. అందరూ ఆ మహనీయుడి బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
పటేల్ జీవితం యువతకు ఆదర్శం..
ఎస్పీ రత్న మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్య్రానంతరం 550పైగా సంస్థానాలను దేశంలోకి విలీనం చేసి దేశ సమైక్యతకు పటేల్ కృషి చేశారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం మొత్తం ఒకటిగా ఉందన్నారు. దేశానికి పటేల్ చేసిన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం 1991వ సంవత్సరంలో ఆయనకు భారతరత్న ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, డీఎస్పీ ఆర్‌ఐలు వలి, మహేష్, రవికుమార్, సీఐలు సునీత, ఇందిర, నరేంద్రరెడ్డి, బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్, వీరన్నతోపాటు పలువురు అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఏక్తా దివస్
ప్రశాంతి నిలయం: ప్రతి భారతీయుడు దేశ ఐక్యత, సమగ్రతకు పాటుపడాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టరేట్ సిబ్బందితో ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
దేశాభివృద్ధికి యువత ముందుండాలి
యూనిటీ ఫర్ రన్‌లో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment