No Headline
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.. ఆ చట్టాలను అధికారులు అమలు చేస్తారు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇందుకు భిన్నంగా కథ సాగుతోంది. ‘చట్టాలు మేమేం చేస్తాం, వాటిని అమలు కూడా మేమే చేస్తాం’ అన్నట్లుగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఈ వింత పోకడ సాగుతోంది.
ఖాకీల ఉక్కిరిబిక్కిరి..
శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకంగా ఉండే ఖాకీలపై ఇటీవల ఎమ్మెల్యేల ఒత్తిళ్లు ఎక్కువైపోయాయి. దీంతో ఎటూ పాలుపోక పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇసుకాసురుల నుంచి మద్యం మాఫియా వరకూ ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా ఎమ్మెల్యేల అనుమతి ఉంటేనే పోలీసులు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సాధారణంగా ఎక్కడైనా నేరాలు జరుగుతుంటే ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందుకు వెళుతుంది. కానీ ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యే చెబితేనే చర్యలు ప్రారంభిస్తున్నారు. అనంతపురం వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో మట్కా, బెట్టింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా సీఐ కనీసం చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పాటు స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
అదుపుతప్పిన శాంతిభద్రతలు..
‘కనిపించే మూడు సింహాలు కాదు కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అన్న డైలాగులు ఉమ్మడి జిల్లా పోలీసులకు ఏ మాత్రమూ సరిపోవడం లేదు. ఏళ్ల నుంచి వివిధ హోదాల్లో పనిచేసిన పోలీసులు సైతం ఎమ్మెల్యేల బెదిరింపులతో వణికిపోతున్నారు. తమ బాస్ ఎస్పీనా, ఎమ్మెల్యేనా అన్నది తేల్చుకోలేని అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీకి ముందు సమాచారం ఇస్తే ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో, అలాగని ఎమ్మెల్యేల మాటలు విని ముందుకెళ్లాక మీడియాలో వార్తలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న భయంతో కిందిస్థాయి పోలీసులు నలిగిపోతున్నారు. ఇదే క్రమంలో పోలీసులెవరూ ఎస్పీని లెక్కచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. గంజాయి, మట్కా, బెట్టింగ్, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, జూదం...అన్నిటికీ మించి బెల్టుషాపుల ఏర్పాటు వంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
బాస్ ఎవరో తేల్చుకోలేక సతమతం
ఎమ్మెల్యేల మితిమీరిన పెత్తనం
గతంలో ఎన్నడూ లేని విధంగా
నేతల జులుం
చెప్పినట్టు చెయ్యకపోతే నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం
కానిస్టేబుల్ నుంచి సీఐల వరకు ఎస్పీ మాట వినడం లేదని విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment