తగ్గిన ఎండు మిర్చి ధర
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర తగ్గింది. రెండు వారాల క్రితం క్వింటా రూ.19 వేలకు పైగా పలికిన ఎండుమిర్చి 15 రోజుల్లో ఏకంగా రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా పడిపోయింది. మంగళవారం హిందూపురం మార్కెట్‌కు 550 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, మొదటి రకం క్వింటా రూ.14 వేలు, రెండో రకం రూ.10 వేలు, మూడో రకం రూ.7 వేల చొప్పున ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు. ఎండుమిర్చిలో తేమశాతం ఎక్కువగా ఉండటం, ప్రధాన నగరాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటంతో ధర తగ్గినట్లు వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.
టమాటకు ఇన్సూరెన్స్
● ఎకరాకు రూ.1,600 ప్రీమియం
పుట్టపర్తి అర్బన్: టమాట పంటకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిందని ఉద్యానశాఖ అధికారి నవీన్‌కుమార్ తెలిపారు. ‘ఇఫ్‌కో–టోకియో’ కంపెనీ ఇన్యూరెన్స్ చేస్తోందని, ఒక ఎకరాకు రూ.3,200 ప్రీమియంగా నిర్ణయించిందన్నారు. ఇందులో సగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని, మిగతా రూ.1,600 రైతులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు డిసెంబర్ 15వ తేదీలోపు సీఎస్‌సీ కేంద్రాలు, సచివాలయాల్లో ప్రీమియం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారి సూచించారు. పూర్తి వివరాలకు 7989690495 నంబరులో సంప్రదించవచ్చన్నారు. ఒకవేళ ప్రీమియం చెల్లించిన రైతులు తమకు బీమా వద్దనుకుంటే ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారన్నారు. ఈ పథకం ద్వారా అత్యధికంగా ఎకరాకు రూ.32 వేల వరకూ బీమా సదుపాయం ఉంటుందన్నారు.
23న సాగునీటి
సంఘాల ఎన్నికలు
ప్రశాంతి నిలయం: జిల్లాలోని 230 సాగునీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఇందుకు రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో జలవనరుల శాఖ అధికారులు కూడా నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. సాగునీటి సంఘం ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో తొలి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గొడవలు తలెత్తకుండా మైనర్ ఇరిగేషన్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. కాడా కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు లిస్ట్ తప్పుల్లేకుండా తయారు చేయాలని, నోడల్ ఆఫీసర్లు జాబితాను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయసారథి, జలవనరుల శాఖ ఈఈ రాధాకృష్ణ, డీఈ గంగాధర్, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్ కుమార్, మహేష్, శర్మ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment