అట్రాసిటీ చట్టం పక్కాగా అమలు
ప్రశాంతి నిలయం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఇందుకోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులతో పాటు వివాదాలు, భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించి బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలన్నారు. అట్రాసిటీ చట్టంపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు పీఓఏ చట్టం అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం ఇప్పటి వరకు నమోదైన కేసును, అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు అందిన పరిహారంపై కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా పౌర హక్కుల అమలు తీరును క్షేత్రస్థాయిలో గమనించడానికి ప్రతి నెలా చివరి రోజున గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు, పరిహారం అందించే అంశంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ సూచించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామస్థాయిలో రెవెన్యూ, పోలీసులను సమన్వయ సహకారంతో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా యంత్రాంగం కూడా త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికల కోసం స్థలం గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హెల్‌లైన్ నంబర్ 14566 ను పట్టికల నోటీసులో ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్, పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్ కుమార్, మహేష్, శర్మ, పెనుకొండ, కదిరి, హిందూపురం డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శివనారాయణ స్వామి, కేవీ మహేష్, ధర్మవరం రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు వీరనారాయణ, శ్రీనివాస నాయక్, శ్రీనివాసులు, గంగులయ్య, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చట్టంపై అవగాహన కల్పించాలి
సచివాలయాల్లో 14566 నంబర్ ప్రదర్శించాలి
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment