కొనసా..గుతున్న పనులు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 23వ తేదీన జయంతి వేడుకలకు ట్రస్ట్ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నా... పారిశుధ్య పనులు, రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ పనులు ఇంకా కొనసాగుతుండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. మరింత మంది వస్తున్నారు. డబ్బుకు కొదవ లేదని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రకటించినా సంబంధిత కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ సగం పనులు కూడా పూర్తికాకపోవడంతో భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి రోడ్డు , పెద్ద కమ్మవారిపల్లి రోడ్డు, వెస్ట్ గేట్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయలేదు. చిన్న గుంతలను పూడ్చినా పెద్ద గుంతలను అలాగే వదిలేశారని ప్రజలు వాపోతున్నారు. డివైడర్ల మధ్య , ప్రధాన రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించే పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు అందుబాటులో ఉన్నా.. పిలిపించుకోకపోవడంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక విద్యుత్ పనులు కూడా పూర్తికాలేదని చెబుతున్నారు. చిత్రావతి నది పరిసరాల్లో కూడా పారిశుధ్య పనులు పూర్తికాకపోవడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు. అలాగే ఎనుములపల్లి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న శిల్పారామం సమీపంలో ప్రధాన రోడ్డుపైకి మట్టి దిబ్బలు వచ్చినా నేటికీ తొలగించలేదు. ఇన్ని పనులు మరి ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.
రేపే సత్యసాయి బాబా జయంతి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment