సచివాలయ సేవల్లో జాప్యం
సచివాలయ సేవల్లో జాప్యం జరుగుతోంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణం. ఖాళీల భర్తీలో కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మడకశిర: కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇదివరకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా గ్రామస్థాయిలోనే అన్ని సేవలూ అందుబాటులో ఉండేవి. దీంతో దూరాభారం, వ్యయప్రయాసలు తగ్గి.. సమయం ఆదా అయ్యేది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 32 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాలు 544 ఉన్నాయి. 5,325 పోస్టులకు గాను 4,351 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా 974 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఖాళీల భర్తీ ఏదీ..?
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా ఇంతవరకూ పోస్టుల భర్తీపై దృష్టి సారించలేదని నిరుద్యోగులు వాపోతున్నారు.
పనిభారంపై అసంతృప్తి
కూటమి సర్కారు తీరుపై సచివాలయాల సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో వలంటీర్ల వ్యవస్థ ఉండేది. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ తదితర ప్రభుత్వ సేవలు ప్రజలకు అందేవి. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు. దీంతో సచివాలయాల సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్లను కూడా సిబ్బందే పంపిణీ చేస్తున్నారు. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో మరింత పనిభారం పెరిగిపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరతే కారణం
జిల్లా వ్యాప్తంగా 974 పోస్టులు ఖాళీ
పనిభారంతో సతమతమవుతున్న ఉద్యోగులు
పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం తాత్సారం
Comments
Please login to add a commentAdd a comment