పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురండి
● హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్
కదిరి టౌన్: హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్‌కుమార్ సూచించారు. మంగళవారం కదిరి రూరల్ పోలీసు స్టేషన్ వెనుక నారాయణ గ్రౌండ్‌లో నిర్వహించిన హోంగార్డుల పరేడ్‌ను ఆయన తనిఖీ చేసి.. దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకున్నవని అన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విధుల్లో నైపుణ్యం మెరుగుపరచుకునేందుకు మెలకువలు తెలియజేశారు. డ్రిల్, కవాతు, ప్రముఖుల బందోబస్తు, ట్రాఫిక్ తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఆర్, ఆర్‌ఎస్‌ఐ వీరన్న, హోంగార్డు ఇన్‌చార్జ్ రామాంజనేయులు, హోంగార్డులు పాల్గొన్నారు.
సౌదీ అరేబియాలో ఉద్యోగావకాశాలు
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓం క్యాప్ ,ఆల్ యూసెఫ్ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా యువతీ యువకులకు సౌదీ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, 35 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు సౌదీ అరేబియాలో దేశంలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు భారత కరెన్సీ ప్రకారం మగవారికి రూ.78 వేలు, అడవారికి రూ.89 వేల జీతం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోపు skillinternational@apssdc.in మెయిల్‌కు బయోడేటా పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
సాగునీటి ఎన్నికలకు
పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చేతన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ గెజిట్ నోటిఫికేషన్‌ను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ కింద 214 సాగునీటి సంఘాలు ఉన్నాయని, మీడియం ఇరిగేషన్ కింద 16 ఉన్నాయని వివరించారు. 14వ తేదీన సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిలకడగా ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఎండు మిర్చి ధరలు మంగళవారం నిలకడగా సాగాయి. మార్కెట్‌కు 164 మంది రైతులు 195.40 క్వింటాళ్ల ఎండు మిర్చి తీసుకొచ్చారు. మొదటి రకం క్వింటాలు రూ.17వేలు, రెండో రకం రూ.8వేలు, మూడో రకం రూ.7వేలు ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే ధరలు కాస్త పెరిగి నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో కిడ్నాపర్?
మడకశిర: బేగార్లపల్లికి చెందిన బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని బాలికను రక్షించినట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. బాలిక మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. కుమార్తెను రక్షించాలని తల్లిదండ్రులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విచారణలో జరుగుతున్న జాప్యానికి మనస్తాపం చెందిన బాలిక తల్లిదండ్రులు వేరువేరుగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేసి కిడ్నాపర్‌ను పట్టుకుని, బాలికను రక్షించినట్లు తెలిసింది. కిడ్నాపర్ అదే గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment