కూటమి సర్కారు కళ్లు తెరిపిద్దాం
సోమందేపల్లి: వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి సర్కారు కళ్లు తెరిపిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న పుట్టపర్తిలో నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం చల్లాపల్లిలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలముందు రైతులకు అండగా ఉంటామని కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సమయానికి రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమయ్యేదని తెలిపారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కింద అందిన డబ్బుతో మహిళలు మద్యం, గంజాయికి బానిసలయ్యారని మంత్రి సవిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ముస్లింల శ్మశానవాటిక స్థలానికి సంబధించి మంత్రి భర్త వెంకటేశ్వరరావు ఓ కౌన్సిలర్, మైనార్టీలను ఉద్దేశించి శాల్తీలు లేచి పోతాయని వార్నింగ్ ఇవ్వడం చూస్తే పెనుకొండలో రౌడీ రాజ్యం నడుస్తోందని అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బాబురెడ్డి, మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసలు, జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రఫీక్, సర్పంచ్ కిష్టప్ప, సింగిల్‌విండో చైర్మన్ ఆదినారాయణరెడ్డి, సీనియర్ నాయకులు కంబాలప్ప తదితరులు పాల్గొన్నారు.
13న భారీ ర్యాలీని విజయవంతం చేయండి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment