ఫుల్లుగా కమీషన్ల కిక్కు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పుష్ప సినిమా తరహాలో సిండికేట్‌గా మారి మద్యం షాపుల పర్మిట్ల కోసం ఇటీవల టీడీపీ నేతలు పోటీపడ్డారు. ఆ తర్వాత బెల్టుషాపులు, పర్మిట్ రూముల పేరుతో విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తున్నారు. ఇప్పటివరకూ పాలకుల ఆగడాలు ఒకెత్తయితే అవినీతిలో తామేం తక్కువ అన్నట్లు మద్యం డిపోను వసూళ్లకు అడ్డాగా మార్చారు కొందరు ప్రబుద్ధులు. డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని సజావుగా, సక్రమంగా సరఫరా చేయాల్సిన డిపో అక్రమాలకు నిలయంగా మారింది. డిపో మేనేజర్, ఇతర సిబ్బంది సిండికేట్‌గా మారి వసూళ్లకు తెరలేపారు. డిపోలో అధికారుల తీరుకు నిరసనగా జిల్లాలోని వైన్‌షాపుల నిర్వాహకులు, బార్‌ల యాజమాన్యాలు ధర్నాకు దిగాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
మామూళ్లిస్తే కావాల్సినంత మద్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రమారమి 230 వైన్‌షాపులు ఉన్నాయి. వీరిలో ఎవరైనా సరే డిపోకెళ్లి అడిగినంత సరుకు కావాలంటే మామూళ్లిచ్చుకోవాల్సిందే. లేదంటే రేషన్ తరహాలో కోత వేస్తున్నారు. ముఖ్యంగా చీప్‌లిక్కర్, బీర్‌ల విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్ల (బాగా అమ్ముడయ్యే మద్యం) విషయంలోనూ ఎక్కువగా కోత ఉంది. అధికార పార్టీకి చెందిన కొంతమందికి మాత్రం రాత్రి పూట మద్యం లోడ్ చేసి పంపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం కొందరు బార్‌ల యజమానులు డిపోకు వెళ్లి అక్కడి అధికారుల అవినీతిపై మండిపడ్డారు. తాము డబ్బు కడతామంటే సరుకు ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అవినీతి కంపు..
గత ప్రభుత్వ హయాంలో మద్యం డిపోపై ఎప్పుడూ చిన్న ఫిర్యాదు కూడా లేదు. కానీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తెచ్చింది. దీంతో మద్యం డిపో అవినీతి కూపంలో కూరుకుపోయింది. ఒక్కో వైన్‌షాపు నెలకు రూ.5 వేల మేర డిపో అధికారులకు చెల్లించాల్సిందేనని రేటు ఫిక్స్ చేశారు. లేదంటే అడిగినంత సరుకు ఇచ్చేది ఉండదు. మద్యం కేస్‌లను ఓపెన్ చేసి చూపించడం లేదని, బాటిళ్లు లీకేజీ ఉంటే ఆ ఖర్చు వైన్‌షాపు నిర్వాహకులే భరించుకోవాల్సి వస్తోందని తెలిసింది. మద్యం ఇండెంట్‌లలో ఒక్కో బిల్లుకు రూ.250 చెల్లించాల్సిందే. రోజూ బిల్లు చేయించుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రోజుకు 300కు పైగా బిల్లులు జనరేట్ అయితే, ఇందులో ఒక్కో బిల్లుకు రూ.250 చొప్పున రోజుకు రూ.75 వేలు అనధికారికంగా ఇవ్వాలి. డిపో మేనేజర్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో కూటమి సర్కారు తెచ్చిన మద్యం పాలసీ అభాసుపాలవుతోంది.
అనంతపురంలోని మద్యం డిపో
మద్యం డిపోలో వసూళ్ల మాఫియా
కమీషన్ ఇస్తే అడిగినంత సరుకు సరఫరా
కాదు..లేదు అంటే కోతలు
ఒక్కో వైన్ షాపునుంచి నెలకు రూ.5 వేల మేర కప్పం
మద్యం కేస్‌లు ఓపెన్ చేసి చూపించరు.. లీకేజీ ఉంటే భరించాల్సిందే
లబోదిబోమంటున్న షాపుల నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment