బాల్య వివాహాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
ప్రశాంతి నిలయం: జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బాల్య వావాహాల నిర్మూలనపై సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీఓలు, సీడీపీఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసులు, గ్రామాల్లో ఉన్న బాల్య వివాహాల నిరోధక కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 105 బాల్య వివాహాలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. ప్రతి నెలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహాలు, బాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలు తదితర అంశాలపై అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ చట్ట ప్రకారం 18 సంవత్సరాల వయస్సు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ సారథి, ఐసీడీఎస్ పీడీ సుధా వరలక్ష్మి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, శర్మ, మహేష్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి..
సమాజంలో వివిధ కారణాల వల్ల సతమతమవుతున్న వయో వృద్ధుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎస్పీ రత్న, డీఆర్వో విజయసారథి, విభిన్న ప్రతిబావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో కలసి వయోవృద్ధుల సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల పోషణ, నిర్వహణ బాధ్యతలను పట్టించుకోని పిల్లలకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అడవుల సంరక్షణకు కృషి..
జిల్లాలో అన్యాక్రాంతమైన అటవీ భుములను స్వాధీనం చేసుకుని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతంలో కొండలకు నిప్పు పెట్టకుండా గ్రామస్థాయిలో పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment