వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
నల్లచెరువు: ఏపీ మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ కృష్ణప్ప పిలుపునిచ్చారు. గురువారం దేవిరెడ్డిపల్లి వద్దనున్న ఏపీ మోడల్ స్కూల్‌ను ఏజీసీడీఓ సంపూర్ణతో కలిసి డీఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నెలకొన్న సమస్యలపై ప్రిన్సిపాల్ రాణాప్రతాప్ నాయక్‌తో చర్చించారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని, లేదా ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. ఎంఈఓ తిరుపాల్ నాయక్ పాల్గొన్నారు.
నేడు బాలబాలికల
కబడ్డీ జట్ల ఎంపిక
బత్తలపల్లి: బత్తలపల్లి ఆర్డీటీ క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లా బాలబాలికల జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.రామ్‌తేజ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, కార్యదర్శి రాగిరి రామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కర్నూలు కేఈ ఫామ్ హౌస్‌లో 50వ మూలపురి రంగారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ చాంపియన్స్‌షిప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. బాలురు బరువు 70 కేజీలు, బాలికలు 65 కేజీలలోపు ఉండాలని, ఒరిజనల్ పదవ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక పోటీలు మ్యాట్‌పై నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు మ్యాట్ షూ ధరించాలని తెలిపారు.
వైవీఆర్ గేట్లు ఎత్తివేత
ముదిగుబ్బ: యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్)కు ఉన్న రెండు గేట్లను గురువారం ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు ఏఈ కృష్ణకుమార్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి వైవీఆర్ పూర్తిగా నిండింది. డ్యాం సామర్థ్యం 0.84 టీఎంసీలు కాగా, 3,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నీరు సీబీఆర్‌కు చేరుతుంది. గురువారం రాత్రి దొరిగిల్లు వద్ద ఉన్న పల్లపు వంతెనపై 4 అడుగుల ఎత్తున పారింది.
Comments
Please login to add a commentAdd a comment