ఎక్సైజ్ నిర్వాకం.. నేరాలకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ నిర్వాకం.. నేరాలకు ఊతం

Published Sat, Jan 4 2025 8:01 AM | Last Updated on Sat, Jan 4 2025 2:48 PM

అనంతపురం నగరంలో ఓ వైన్ షాపు వద్ద ఇదీ పరిస్థితి

అనంతపురం నగరంలో ఓ వైన్ షాపు వద్ద ఇదీ పరిస్థితి

పెరుగుతున్న మద్యం ఆధారిత నేరాలు

విచ్చలవిడి విక్రయాల వల్లే ఈ తరహా కేసులు

ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతే కారణమంటున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని నెలలుగా రాజకీయ కక్షలు, దొంగతనాలు తదితర వాటితో పల్లెలు అట్టుడుకుతున్నాయి. దీనికితోడు ఇప్పుడు విచ్చలవిడి మద్యం, గంజాయి కేసులు ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా బహిరంగ మద్యపానం వల్ల నేరాలు పెరిగాయి. మద్యం మత్తులో పట్టణాలు, పల్లెల్లో నేరాలు చేస్తుండడంతో తరచూ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న మద్యం, గంజాయి సంబంధిత కేసులతో సివిల్‌ పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

చేతులెత్తేసిన ఎక్సైజ్ అధికారులు

ఎకై ్సజ్‌ అధికారులు రెండు జిల్లాల్లోనూ చేతులెత్తేశారు. స్వయానా ఎమ్మెల్యేలే పర్మిట్‌ రూములు తెరిచి మద్యం ఏరులై పారిస్తున్నా.. కనీసం కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, సూపరింటెండెంట్‌ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురూ అధికార పార్టీ నాయకుల ప్రభావానికి లోనై విచ్చలవిడి మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. భారీ స్థాయిలో ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇక ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. బార్‌లు, వైన్‌షాపుల యాజమాన్యాలతో ‘సెటిల్‌మెంట్‌’లు చేయడమే పనిగా పెట్టుకున్నారని కొందరు బార్‌ యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా విచ్చలవిడి మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తత వెరసీ మద్యం ఆధారిత నేరాలు బాగా పెరిగిపోయాయి. ఈ భారం తమపై పడుతోందని సివిల్‌ పోలీసులు వాపోతున్నారు. ‘మామూళ్లు వారికి, బాధలు మాకా’ అంటూ ఓ పోలీస్‌ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలో ... 

మద్యం షాపులు 230
బార్‌లు 29
రోజుకు మద్యం వినియోగం విలువ రూ.6 కోట్లు
రోజుకు సగటున డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు 500కు పైనే
మత్తులో జరిగిన గొడవలు, ఇతరత్రా కేసులు సుమారు 200

ఇటీవల అనంతపురం టవర్‌క్లాక్‌ వద్ద మద్యం సేవించినట్టు ధ్రువీకరించిన ఇద్దరి వ్యక్తులకు, పోలీసులకు మధ్య మాటామాటా పెరిగింది. ఓ వ్యక్తిని మఫ్టీలో ఉన్న పోలీసు బూటు కాలితో తన్నిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

వారం కిందట గుత్తిలో ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి చిరు వ్యాపారిని చితకబాదాడు. గాయపడిన ఆ వ్యాపారి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నాలుగు రోజుల కిందట అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌లో ముగ్గురు యువకులు మద్యం సేవించి కానిస్టేబుల్‌కు ఎదురుతిరిగారు. మాటామాటా పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకోగా.. కొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement