నేత్రపర్వం... బ్రహ్మ రథోత్సవం
పావగడ: నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు బదరీనాథ్ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మూల విరాట్ ఏడు పడగల సర్పాకార అంత్య సుబ్రహ్మణ్యస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రాతఃకాల షోడశ ఉపచార పూజలు, పంచామృతాభిషేకం, మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, ప్రాకారోత్సవం తదితర పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని తీసుకొచ్చి బ్రహ్మరథంలో ప్రతిష్ఠించారు. వంట శాలలో అన్నం రాశిపై నాగ దేవతను ఉంచగా ఆ అన్నం రాశి రెండు గా చీలింది. ఒక వైపు బ్రాహ్మణులకు, మరో వైపు రాశి భక్తులకని ప్రతీతి. వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. భక్తులు అరటి పండ్లను రథం మీదికి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ మంత్రి వెంకటరమణప్ప, ఎమ్మెల్యే వెంకటేశ్, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎండోమెంట్ అధికారి ఏసీ గోటూరు శివప్ప, తహసీల్దార్ వరదరాజు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్ లాంఛనప్రాయంగా రథాన్ని లాగారు. భక్తులు రథానికి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం రథం యథాస్థానానికి చేరుకుంది.
పావగడలో అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మ రథోత్సవానికి పోటెత్తిన జనం
Comments
Please login to add a commentAdd a comment