పోటాపోటీగా వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా వసూళ్లు

Published Mon, Jan 6 2025 7:19 AM | Last Updated on Mon, Jan 6 2025 7:18 AM

పోటాప

పోటాపోటీగా వసూళ్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: సార్వత్రిక ఎన్నికలు –2024లో ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమి పార్టీల తరఫున సత్యకుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మంత్రి పదవిని అలంకరించారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో ధర్మవరాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతారని అందరూ ఆశించారు. అయితే ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండటంతో కూటమి పార్టీల నాయకులు దురాగతాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వారి దౌర్జన్యాలను కట్టడి చేసేవారే లేకుండా పోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధర్మవరంలోని నేసేపేటలో అయితే బడా వ్యాపార వేత్తలు, చేనేతలు, చేనేత వ్యాపారులే టార్గెట్‌గా కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఇవ్వాలంటూ, తమ పొలాలు, ప్లాట్లు చెప్పిన ధరకు కొనాలంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు దౌర్జన్యాలకు ఎందరో బలవుతున్నారు. కానీ స్వతహాగా మృదుస్వభావులైన చేనేతలు బయటకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.

దురాగతాల్లో మచ్చుకు కొన్ని..

నేసేపేటలోని ఓ పట్టుచీరల వ్యాపారి రెడ్డి సామాజికవర్గానికి చెందిన రియల్టర్‌ నుంచి కొంత భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది తెలుసుకున్న టీడీపీ నాయకుడి అనుచరుడు సదరు వ్యాపారిని బెదిరించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారితో భూమిని ఎలా కొంటావని బెదిరించి రూ.30 లక్షల దాకా వసూలు చేసినట్లు సమాచారం.

● కూటమి పార్టీల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మరో పట్టు చీరల వ్యాపారిని ప్రభుత్వం రాగానే కొందరు టీడీపీ కార్యకర్తలు ఫోన్‌లో కోట్లాది రూపాయలు కావాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సదరు వ్యాపారి అంగీకరించక పోవడంతో బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేదిలేక ఆ వ్యాపారి మంత్రి కోటరీలో చేరిపోయారు.

● పట్టణానికి చెందిన ఇద్దరు చేనేత వ్యాపారులు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారన్న కారణంతో టీడీపీ నాయకుని అనుచరులు వారి ఇళ్ల వద్ద అలజడులు సృష్టించి భయాందోళనకు గురి చేశారు. వారిలో ఒకరితో రూ.కోటికి పైగా వసూలు చేయగా మరో వ్యాపారితో మార్కెట్‌ రేటు కంటే రెండురెట్లు ఎక్కువకు భూమిని కొనుగోలు చేయించి కోట్లాది రూపాయల లబ్ధి పొందారు.

● రేగాటిపల్లికి చెందిన భూముల్లో వెంచర్‌లు వేసినందుకు అడ్డు చెప్పకుండా ఉండేందుకు హిందూపురానికి చెందిన భూ యజమానులను బెదిరించి జనసేన నాయకులు ఒక యజమానితో 60 సెంట్లు, మరో యజమానితో 1.60 ఎకరాల భూమిని బినామీ పేర్లతో అప్పణంగా రాయించుకున్నారు. అంతేకాక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

● బీజేపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు మున్సిపాలిటీలో ప్లాన్‌ అప్రూవల్స్‌ ఇప్పించేందుకు పెద్ద దుకాణమే తెరిచారు. వారి అనుమతి లేకుండా ప్లాన్‌ అప్రూవల్స్‌ రాకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారికి అంతో ఇంతో డబ్బు ముట్టబెజితే ప్లాన్‌ అప్రూవల్స్‌ మంజూరు చేయించేలా స్కెచ్‌ వేశారు. అంతేకాక డీ చెర్లోపల్లి వద్ద ఇసుకను జేసీబీలు, ట్రాక్టర్‌ల ద్వారా రాత్రింబవళ్లు అక్రమంగా రవాణా చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

పట్టుచీరల అమ్మకాలు, కొనుగోలుకు ప్రసిద్ధిగాంచిన సిల్క్‌సిటీ ధర్మవరం నేడు దందాలు, దౌర్జన్యాలకు కేరాఫ్‌గా మారుతోంది. కూటమి నాయకుల చెరలో చేనేతలు, వ్యాపారులు నలిగిపోతున్నారు. ఎక్కడ సెంటు స్థలం కొన్నా, స్థలమో, పొలమో అమ్మినా బెదిరింపులు మొదలవుతున్నాయి. ఎంతో కొంత ముట్టజెబితే ఓకే.. లేదంటే తీవ్రమైన మనోవేదనకు లోనయ్యేలా కూటమి పార్టీల నాయకులు, వారి అనుచరులు ఇబ్బందులు పెడుతున్నారు. కూటమిని నమ్మి ఓట్లు వేసిన పాపానికి అనుభవిస్తున్నామని జనం పశ్చాత్తాప పడుతున్నారు. ఇటీవల చేనేతల సన్మాన కార్యక్రమంలో స్వయంగా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు ధర్మవరంలో జరుగుతున్న దురాగతాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అద్దం పడుతున్నాయి.

కూటమి చెరలో ‘సిల్క్‌ సిటీ’

ఆరు నెలలుగా దందాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు

మదనపడుతున్న వ్యాపారులు, చేనేత కార్మికులు

కందికుంట వ్యాఖ్యలతో బయటపడ్డ దౌర్జన్యాల పర్వం

ఇంత జరుగుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలలో కూటమి పార్టీల నాయకులు ఒకరికి మించి ఒకరు ఉన్నారు. దీంతో చేనేతలు, వ్యాపారులు తమ సామాజిక వర్గానికి చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ వద గోడు వెల్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మవరంలో సన్మాన సభ ఏర్పాటు చేసి తామంతా ఐక్యంగా ఉన్నట్లు చాటారు. ఈ వేదిక నుంచి కందికుంట చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి పార్టీల నేతల దౌర్జన్యాలు, దాడులను కందికుంట ఎండగట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ధర్మవరం ప్రజలు చరిత్రలో ఎందరో ఎమ్మెల్యేలు, ఎన్నో ప్రభుత్వాలను చూశారు. అయితే ఇంతటి భయంకరమైన పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ దురాగతాలను అదుపు చేయకపోతే రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వారు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
పోటాపోటీగా వసూళ్లు 
1
1/1

పోటాపోటీగా వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement