రైలు కింద పడి యువకుడి మృతి
హిందూపురం అర్బన్: స్థానిక జీఆర్పీ పరిధిలోని గుడ్డం దోభీఘాట్ వద్ద పట్టాలపై ఓ గుర్తుతెలియని యువకుడి (30) మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీ నాయక్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి పెనుకొండ వైపు వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చేతిపై పెద్ద పచ్చబొట్టు ఉంది. ఆచూకీ తెలిసిన వారు 93988 66299కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
వేడినీళ్లు పడి చిన్నారికి గాయాలు
కనగానపల్లి: వేడి నీళ్లు శరీరంపై పడడంతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన మహేష్, ప్రవళిక దంపతులకు రెండేళ్ల వయసున్న కుమారుడు కృష్ణచైతన్య ఉన్నాడు. ఆదివారం సాయంత్రం స్నానం కోసమని ఆరుబయట పొయ్యిపై గిన్నెలో నీరు పెట్టి తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న కృష్ణ చైతన్య నేరుగా వెళ్లి పొయ్యిపై ఉన్న గిన్నెను లాగడంతో వేడి నీరు ఒక్కసారిగా మీదపడింది. దీంతో చిన్నారి ముఖం, చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అమ్మా.. నన్ను క్షమించు!
రొద్దం: ‘అమ్మా...నన్ను క్షమించు’ అంటూ సూసైడ్ నోట్ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన అనంతరం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు సోమశేఖరరెడ్డి (23) గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. అయితే నిర్ధిష్ట కారణమేమిటో తెలియదు కానీ, ఆదివారం ఉదయం ఎల్‌జీబీ నగర్ సమీపంలోని ఓ తోట వద్ద వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించు. నీ కొడుకుగా నీకు అన్యాయం చేస్తున్నా. నా లైఫ్‌లో ఇష్టం లేని చాలా పనులు చేశాను. నాకు బతకడం ఇష్టం లేదు. ఒకరి వల్ల నేను చావలేదు... నేనే చస్తున్నా. ఎవరిని కూడా ఇందులో ఇరికించకండి. లవ్ యూ అమ్మా... నన్ను క్షమించండి’ అని తన పోస్టులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment